పవన్ దాని ఊసే ఎత్తలేదేంటి?

Sun Mar 19 2017 10:17:01 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ చేసే మంచి పనుల గురించి.. అతడి గొప్ప మనసు గురించి ఇప్పటికే చాలామంది చాలా చెప్పారు. పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలోనూ తన ఫ్రెండు గురించి గొప్పగా మాట్లాడాడు. కష్టం అని వచ్చేవాళ్లకు పవన్ ఎలా సాయం చేస్తాడో దగ్గరుండి చూశానని.. కానీ అతను అవేవీ బయటికి చెప్పుకోడని త్రివిక్రమ్ చెప్పాడు. కానీ ఈ వేడుక జరగడానికి ముందు రోజు పవన్ గత సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల తాను రెండు కోట్ల దాకా నష్టపోయానంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అతను కొన్ని రోజుల నుంచి ‘సర్దార్’ నిర్మాత.. పవన్ మేనేజర్ మీద ఆరోపణలు గుప్పిస్తున్నాడు. తనకు అన్యాయం జరిగిందంటున్నాడు. ఇంకా కొందరు ‘సర్దార్’ బాధితులు గళం విప్పారు. కానీ ఇప్పటిదాకా పవన్ ఈ విషయమై స్పందించింది లేదు. పవన్ తరఫున ఇంకెవరూ కూడా మాట్లాడింది లేదు. శరత్ మరార్ కూడా మౌనం పాటిస్తున్నాడు.

ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న వాదనలో తప్పు ఉంటే దానిపై వివరణ ఇవ్వాలి. ఆరోపణల్ని ఖండించాలి. కానీ అలాంటిదేమీ లేకుండా మౌనం పాటిస్తున్నారు. పవన్ ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాడని.. వాకబు చేస్తున్నాడని.. సరైన సమయంలో సమస్యను పరిష్కరిస్తారని కొన్ని పీలర్లు వస్తున్నాయి కానీ.. ‘కాటమరాయుడు’ విడుదలకు కూడా సిద్ధమైపోతున్న నేపథ్యంలో ఇంకెప్పుడు స్పందిస్తాడో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో అయినా పవన్ ఈ విషయమై ఏమైనా మాట్లాడతాడేమో.. ఏదైనా ప్రకటన చేస్తాడేమో అని చూడగా.. అలాంటిదేమీ లేకుండా తన సుదీర్ఘ ప్రసంగాన్ని అవగొట్టాడు పవన్. మరి ఈ రచ్చ ఎక్కడిదాకా వెళ్తుందో? సమస్య ఎలా పరిష్కారమవుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/