‘డీజే’కు పవన్ అభిమానుల భయం

Mon Jun 19 2017 16:40:40 GMT+0530 (IST)

గత కొన్నేళ్లలో అల్లు అర్జున్ ఫాలోయింగ్.. మార్కెట్ రేంజ్ బాగా పెరిగింది. ఈ ఎదిగే క్రమలో కొన్ని వివాదాలు కూడా అతణ్ని చుట్టుముట్టాయి. పవన్ కళ్యాణ్ అభిమానులతో సున్నం పెట్టుకుని వాళ్లకు శత్రువుగా మారిపోయాడు బన్నీ. ఈ వివాదం విషయంలో పవన్ ఫ్యాన్స్ ను మొదట్లో సరిగా డీల్ చేయకపోవడం వల్ల అంతరం పెరిగిపోయింది. పెద్ద అగాథం ఏర్పడింది. మధ్యలో వాళ్లను దువ్వేందుకు చేసిన ప్రయత్నాలేవీ కూడా పెద్దగా ఫలించలేదు. ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు వచ్చిన డిజ్ లైక్స్ ను బట్టే బన్నీ మీద పవన్ అభిమానుల వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందో అర్థమైంది.

ఇటీవల ‘డీజే’ ఆడియో వేడుకలో బన్నీ పవన్ ఊసెత్తడం ద్వారా ఆయన అభిమానుల్లో వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం చేశాడు కానీ.. అదే సమయంలో ఆ వేడుకలో ‘డీజే డీజే’ అంటూ నినాదాలు చేయించడం.. పవన్ అభిమానులు ఎక్కువమంది ఈ వేడుకకు రాకుండా రిస్ట్రిక్ట్ చేయడం వెనుక బన్నీ ప్లానింగ్ ఉందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘డీజే’కు వ్యతిరేకంగా పని చేయడానికి పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారన్న డిస్కషన్ నడుస్తోంది. సినిమా ఎలా ఉన్నా ప్రిమియర్ షోల టాక్ బయటికి వచ్చే సమయంలో పవన్ అభిమానులు వ్యతిరేక ప్రచారం గట్టిగా చేస్తారని.. ఒకవేళ సినిమాకు డివైడ్ టాక్ ఉంటే మాత్రం ట్రోలింగ్ ఓ రేంజిలో ఉండబోతోందని అంటున్నారు. ఇందులో అధికారికంగా జరిగేదేమీ ఉండదు. అభిమానుల మధ్య ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ ఉంటుంది. ఐతే బన్నీకి సోషల్ మీడియాలో అనుకూల ప్రచారం చేసి పెట్టే పీఆర్ బ్యాచ్ ఉంది. వాళ్లు ట్విట్టర్లో కొన్ని గ్రూపుల్ని మొబిలైజ్ చేసి పాజిటివ్ ప్రచారం చేసి పెడుతుంటారు. కాబట్టి రెండు వర్గాల మధ్య రసవత్తర పోరు ఖాయమన్నమాట. మరి సినిమాకు టాక్ ఎలా వస్తుందో.. ఈ గ్రూపుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/