Begin typing your search above and press return to search.

మ‌హేశ్ వ్యాఖ్య‌ల‌ను నిజం చేస్తోన్న ప‌వ‌న్ ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   18 Jan 2018 8:54 AM GMT
మ‌హేశ్ వ్యాఖ్య‌ల‌ను నిజం చేస్తోన్న ప‌వ‌న్ ఫ్యాన్స్!
X
కోలీవుడ్ లో హీరో హీరోయిన్ల‌ను డెమీగాడ్ లుగా కొల‌వడం.....వారికి గుళ్లూ గోపురాలు క‌ట్టేయడం....వంటి వాటిని గురించి వినే ఉంటాం. త‌మిళ‌నాడులో స్టార్ హీరోల మ‌ధ్య ఫ్యాన్ వార్ పీక్స్ లో ఉంటుంది. త‌మిళ‌నాడులో ఫ్లెక్సీల ద‌గ్గ‌ర తలెత్తిన వివాదంలో ర‌జ‌నీ ఫ్యాన్స్ పై విజ‌య్ ఫ్యాన్స్ క‌త్తుల‌తో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, టాలీవుడ్ లో కూడా అదే త‌ర‌హాలో ఫ్యాన్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. అయితే, ఇక్క‌డ దాడి చేసింది....దాడికి గురైంది కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కావ‌డం విశేషం. బ‌హుశా ఓకే హీరో అభిమానుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగి దాడుల వ‌ర‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి కావ‌చ్చు.

కొద్ది రోజులుగా టాలీవుడ్ లో కూడా కోలీవుడ్ త‌ర‌హాలో ఫ్యాన్స్ విప‌రీత పోక‌డ‌లు పోతున్నారు. కొద్ది రోజుల క్రితం మ‌హేష్ బాబు - ప‌వ‌న్ ఫ్యాన్స్ ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన సంగతి తెలిసిందే. తాజాగా, `అజ్ఞాత‌వాసి` చూసిన ఓ ప‌వ‌న్ వీరాభిమాని తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యాడు. దీంతో, అత‌డు ఆ సినిమా పోస్ట‌ర్ ను చెప్పుతో కొడుతూ...త‌న 100 రూపాయ‌లు వేస్ట్ అయ్యాయంటూ....సినిమాను - ప‌వ‌న్ ను దుర్భాష‌లాడాడు. అంత‌టితో ఆగ‌కుండా... ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అ యువ‌కుడు చేసింది వెర్రి ప‌ని అని....కొంద‌రు నెటిజ‌న్లు భావిస్తుండ‌గానే....అంత‌క‌న్నా వెర్రి ప‌నికి మ‌రికొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ పాల్ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఆ యువ‌కుడు షేర్ చేసిన కొద్ది సేప‌టికే ఆ వీడియో వైర‌ల్ కావ‌డంతో మ‌రికొంత‌మంది ప‌వ‌న్ అభిమానులు ఆ యువ‌కుడి ఆచూకీ తెలుసుకొని అత‌డిపై దాడి చేశారు. అత‌డిని విచ‌క్ష‌ణార‌హితంగా కొడుతూ ఆ ప‌ని ఎందుకు చేశావ‌ని ప్ర‌శ్నించారు.

పొర‌పాటున అలా చేశాన‌ని, త‌ప్ప‌యిపోయింది క్ష‌మించ‌మ‌ని....ఆ యువ‌కుడు వేడుకుంటున్నా విన‌కుండా చిత‌క‌బాదారు. ఆ పోస్ట‌ర్ కు మొక్కించి త‌ప్ప‌యిపోయింద‌ని - క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు. ఇక‌పై ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే వారంద‌రికీ ఈ విధ‌మైన శిక్ష విధిస్తామ‌ని వారు హెచ్చ‌రించారు. సినిమా న‌చ్చ‌కుంటే చూడ‌వ‌ద్ద‌ని - అంతేకానీ ఈ ర‌క‌మైన వీడియోలు పెట్టి త‌మ‌ను, ప‌వ‌న్ ను అవ‌మానిస్తే స‌హించ‌బోమ‌ని చెప్పారు. ఆ యువ‌కుడిని చిత‌క‌బాదిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అది వైర‌ల్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇరువ‌ర్గాల త‌ప్పు ఉంద‌ని, వారంతా విచ‌క్ష‌ణ కోల్పోవ‌డం వ‌ల్లే ఈ ర‌కంగా జ‌రిగింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప‌వ‌న్ అభిమానుల‌పై క‌త్తి మ‌హేశ్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు బ‌ల‌మిచ్చేలా ఈ ఘ‌ట‌న ఉంద‌ని అనుకుంటున్నారు. అభిమానం హ‌ద్దులు దాట‌డం వ‌ల్లే ఈ ర‌కమైన ఘ‌ట‌న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని, సినిమాను సినిమాలా చూడాల‌ని....ఇలా వ్య‌క్తిగ‌తంగా సీరియ‌స్ గా తీసుకోవ‌డం, సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర రీతిలో పోస్టులు పెట్ట‌డం వ‌ల్ల ఎవ‌రికీ ఉప‌యోగం ఉండ‌ద‌ని కొంద‌రు హిత‌వు ప‌లుకుతున్నారు. గ‌తంలో కోలీవుడ్ హీరో అజిత్ - విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య త‌గాదాలు వ‌చ్చిన‌పుడు విజ‌య్, అజిత్ లు స్పందించి ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. మరి ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై ప‌వ‌న్ స్పందిస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.