వీడియో: యాసిడ్ బాధితురాలి లుక్ డిజైన్

Fri May 24 2019 22:12:11 GMT+0530 (IST)

మేకప్ పరంగా ప్రయోగాలు చేయడం.. గంటల కొద్దీ ఓపిగ్గా ప్రోస్థటిక్స్ మేకప్ కి రెడీ అవ్వడం అన్నది విశ్వనటుడు కమల్ హాసన్ కే చెల్లింది. కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించిన కమల్ హాసన్ ఎంతో ఓపిగ్గా మేకప్ వేయించుకుంటారని ఆయన దర్శకులు ఎన్నోసార్లు పొగిడేసిన సందర్భాలున్నాయి. శంకర్ `భారతీయుడు 2` చిత్రం కోసం ప్రస్తుతం కమల్ అలాంటి ఓపికనే ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా కోసం కమల్ ఐదారు గంటలు కేవలం మేకప్ కే కేటాయించడం ఇటీవల చర్చకొచ్చింది. 2.0 చిత్రం కోసం రజనీకాంత్... అంతకు ముందు అపరిచితుడు చిత్రం కోసం విక్రమ్ ఇలాంటి సాహసాలే చేశారు. రోజూ నాలుగైదు గంటలు కేవలం మేకప్ కే సరిపోతే వీళ్లు నటించేది ఎప్పుడు? అన్న సందేహం కలగొచ్చు. అయితే కాల్షీటుకు రెండు మూడు గంటల ముందు నుంచే వీళ్లకు మేకప్ వేస్తుంటారన్నది సెట్స్ లో ఉన్నవాళ్లు చెబుతుంటారు.ప్రస్తుతం యాసిడ్ బాధితుల కాన్సెప్టుతో హిందీలో ఓ సినిమా.. మలయాళంలో వేరొక సినిమా తెరకెక్కుతున్నాయి. ఇవి రెండూ యాసిడ్ బాధితురాళ్లపై సినిమాలు.. పైగా వీళ్లు తమలాంటి వాళ్ల కోసం..  న్యాయం కోసం పోరాటం చేసిన నేపథ్యాన్ని కథాంశాలుగా ఎంచుకున్నారు. బాలీవుడ్ లో దీపిక పదుకొనే కథానాయికగా యాసిడ్ బాధితురాలు.. ఉద్యమకర్త లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇది నిజజీవిత కథ కావడంత సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు. దీపిక ముఖాన్ని రియాలిటీకి ఎంతో దగ్గరగా ప్రోస్థటిక్స్ లో రూపొందించిన వైనం ఆకట్టుకుంది. పబ్లిక్ సైతం గుర్తించలేనంతగా దీపిక మారిపోయి అందరికీ షాకిచ్చింది.

అదే తరహాలో మలయాళ మూవీ `ఉయరే` యాసిడ్ బాధితురాలి కథతో తెరకెక్కి రిలీజైంది. ఈ చిత్రంలో పార్వతి కథానాయిక. తను రోజూ నాలుగు గంటలు ప్రోస్థటిక్స్ మేకప్ కే కేటాయించారు. ఓ మంచంపై పడుకుని ఉన్న తనకి ఇద్దరు మేకప్ ఆర్టిస్టులు ప్రోస్థటిక్స్ ని అమరుస్తున్న వీడియో ఒకటి తాజాగా అంతర్జాలంలోకి విడులైంది. ఈ వీడియో జెట్ స్పీడ్ తో జనాల్లోకి దూసుకెళుతోంది. మను అశోక్ దర్శకత్వంలో గృహలక్ష్మి ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఇటీవలే తిరువనంతరపురంలో ఉయరే చిత్రాన్ని చిన్నారుల కోసం మంత్రి కెకె శైలజ సారథ్యంలో ఓ ప్రీమియర్ ని వేయడం చర్చకొచ్చింది.