Begin typing your search above and press return to search.

మేఘాల్లో తేలుతున్న కన్నడ క్వీన్

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:32 AM GMT
మేఘాల్లో తేలుతున్న కన్నడ క్వీన్
X
చిన్నతనంలో అందరికీ చిత్రమైన కోరికలుంటాయి. కొందరైతే బోలెడు సాహసాలు చేసేయాలని కూడా అనుకుంటారు. కానీ ఆ వయసులో నచ్చిన అడ్వంచర్లు అన్నీ చేసేయడం కుదరదు కదా. పెద్దయిపోయాక అలాంటి కోరికలన్నీ ఎటో వెళ్లిపోతాయి. కానీ అవన్నీ తీర్చుకోగలిగే ఛాన్స్ వస్తే మాత్రం గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాంటి ఛాన్స్ దొరకడంతో తెగ ఎంజాయ్ చేసేశానంటోంది శాండల్ వుడ్ హీరోయిన్ పారుల్ యాదవ్.

చాలామంది హీరోయిన్లలాగే ముంబయి నుంచి సౌత్ కు వచ్చి సెటిలయిన భామ పారుల్ యాదవ్. కన్నడలో వరస హిట్లు ఆమె ఖాతాలో ఉండటంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈమధ్య పారుల్ యూఎస్ వెళ్లింది. అక్కడ బోలెడు ఎడ్వంచర్స్ చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా హెలికాప్టర్ లో ప్రయాణం చేసే అవకాశం దొరకడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. తన చిన్నప్పుడు హెలికాప్టర్ గాలిలో ఎగురుతుండటం చూసి అందులో ట్రావెల్ చేయాలని అనుకునేదాన్నని.. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందని సంబరపడిపోతోంది పారుల్. మేఘాల అంచులను దాటి నేలమీదున్న కట్టడాల్ని చూడటం అనేది మరిచిపోలేని అనుభవం అంటోంది. తన అమెరికా టూర్ లోని ఎఫ్1 కారులో కూర్చుని ఫొటో దిగి ఆ సరదా కూడా తీర్చేసుకుంది. ఆ కారు డ్రైవ్ చేయకపోయినా ఎలా నడుపుతారో దగ్గరుండి తెలుసుకుని వచ్చింది.

పారుల్ యాదవ్ ప్రస్తుతం కన్నడలో రమేష్ అరవింద్ డైరెక్షన్ లో బటర్ ఫ్లై సినిమా చేస్తోంది. ఇది బాలీవుడ్ లో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ సినిమా క్వీన్ కు అఫీషియల్ రీమేక్. క్వీన్ ను సౌత్ లో తమిళంలో రీమేక్ చేద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కన్నడ సీమలో మాత్రం ఆ పని మొదలెట్టేశారు. కన్నడ క్వీన్ కంగనాకు దీటుగా ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.