అ నిర్మాతకు యూట్యూబ్ టైటిల్స్ షాక్!

Tue Sep 18 2018 19:03:36 GMT+0530 (IST)

ఒక హీరోయిన్ కనుక గైనకాలజిస్ట్ దగ్గరుకు వెళ్లిందనుకోండి.. ఏం జరుగుతుంది? సాధారణంగా అయితే ఏం జరగదు.. ఆమెకేదో స్త్రీలకు సంబంధించిన ఇబ్బంది ఉందని అందరూ సరిపెట్టుకుంటారు.  అదే ఆ ఇన్ఫర్మేషన్ కనుక యూట్యూబ్ ఛానెల్స్ (అందరూ కాదు బాబోయ్..!)వాళ్ళకి తెలిస్తే మాంచి మసాలా సీక్వెన్స్ లు..  కసక్కనిపించే థంబ్ నెయిల్స్ తో టైటిల్స్ రెడీ అవుతాయి. అవి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ వాటిని మనం చర్చించుకోవలసిన అవసరం లేదు.  ఇవన్నీ మనకు తెలుసు గానీ 'C/o కంచరపాలెం'  నిర్మాత పరుచూరి ప్రవీణగారికి తెలిసే అవకాశం లేదు.  ఎందుకంటే ఆవిడ అమెరికాలో ఉండే డాక్టరు కాబట్టి.కానీ 'C/o కంచరపాళెం' సినిమా హిట్ కావడంతో ప్రవీణ పేరు అందరికీ తెలిసింది.  ఆమె ఈ సినిమాలో సలీమా అనే వేశ్య పాత్రను పోషించి అందరినీ మెప్పించిన సంగతి కూడా తెలిసిందే.  ఇక వేశ్య పాత్ర పోషించడమే ఆమె పొరపాటు అన్నట్టుగా కొందరు యూట్యూబ్ చానల్స్ వారు రెచ్చిపోయారు.  దీంతో "పరుచూరి ప్రవీణ అదే కంచరపాలెం నిర్మాత ఒక వేశ్య మరి అమెరికాలో ఆమె ఎవరో తెలుసా?" అనే టైటిల్ తో ఉన్న ఒక థంబ్ నెయిల్ ను ప్రవీణ స్వయంగా చూడడంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ ఇమేజ్ ని షేర్ చేస్తూ "దారుణం !!! నిజంగా ఏ మంచిపనికైనా శిక్ష పడకుండా ఉండదు కదా.. #కేరాఫ్ కంచరపాలెం @వెంకటేష్ మహా" అంటూ ట్వీట్ చేసింది.  

ఇక చాలామంది నెటిజనులు ఆమెను ఇలాంటివి పట్టించుకోవద్దని కంచరపాలెం లాంటి అభిరుచి కలిగిన సినిమాను నిర్మించడం తోనే ఆమె విజన్ తెలిసిందని అన్నారు. ఒక నెటిజన్  మాత్రం 'రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది  యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఇలానే గత రెండేళ్లుగా డబ్బు సంపాదిస్తున్నారు.  యూ ట్యూబ్ ఇండియా వారు ఇలాంటి స్పామ్ ఛానల్స్ పై చర్య తీసుకోవాలని' కోరాడు.