Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో నూత‌న్ ప్ర‌సాద్ ఓ తాగుబోతు: ప‌రుచూరి

By:  Tupaki Desk   |   14 Feb 2018 11:30 PM GMT
అప్ప‌ట్లో నూత‌న్ ప్ర‌సాద్ ఓ తాగుబోతు: ప‌రుచూరి
X
నూటొక్క జిల్లాల అంద‌గాడు....విల‌క్ష‌ణ న‌టుడు నూత‌న్ ప్ర‌సాద్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌రలేదు. త‌న‌దైన శైలిలో డైలాగుల‌ను ట్విస్ట్ చేసి చెప్పి....డిఫ‌రెంట్ మేన‌రిజంతో అల‌రించిన గొప్ప న‌టుడు నూత‌న్ ప్ర‌సాద్. ``దేశం చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది....`` అంటూ ఆయ‌న చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేం. అయితే, నూత‌న్ ప్ర‌సాద్ పేరు వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యాన్ని ప‌రుచూరి గోపాలకృష్ణ వెల్ల‌డించారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం త‌న యూట్యూబ్ చానెల్ లో `పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా త‌న సినీ జ్ఞాప‌కాల‌ను ఆయ‌న నెమ‌రు వేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో నూతన ప్రసాద్ గురించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.


నూత‌న్ ప్ర‌సాద్ తో త‌మ సోద‌రుల‌కు ఉన్న అనుబంధాన్ని ప‌రుచూరి గుర్తుచేసుకున్నారు. `చ‌లిచీమ‌లు` సినిమాకు త‌న అన్న‌య్య ఎక్కువ‌గా మాట‌లు రాశార‌ని, అంత‌కు ముందు త‌న‌కు ఆయ‌న‌తో ప‌రిచ‌యం లేద‌ని చెప్పారు. రిలీజ్ రోజున విజ‌య‌వాడ‌లో ఆ సినిమా చూసేందుకు వ‌చ్చాన‌ని, అపుడు నూత‌న్ ప్ర‌సాద్ ను క‌ల‌వ‌మ‌ని అన్న‌య్య చెప్పార‌ని అన్నారు. థియేట‌ర్ ద‌గ్గ‌ర నూత‌న ప్ర‌సాద్ ను చూసేందుకు జ‌నం విప‌రీతనుంగా ఎగ‌బ‌డుతున్నార‌ని....దాంతో అక్క‌డ నుంచి ఆయ‌న పారిపోయి రావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ప‌రుచూరి గుర్తు చేసుకున్నారు.
ఆ త‌ర్వాత హోటల్లో తాను....నూతన ప్రసాద్ కలుసుకున్నామ‌న్నారు. నూతన్ ప్రసాద్ గారు, మీ పేరు భలే విచిత్రంగా వుందే అని తాను ఆయ‌న‌ను అడిగాన‌ని చెప్పారు.

త‌న అసలు పేరు నూతన్ ప్రసాద్ కాద‌ని, గ‌తంలో తాను బాగా తాగేవాడిన‌ని, ఆ అలవాటు త‌న న‌ట‌నను, కెరియర్ ను ఇబ్బంది పెడుతోంద‌నే కార‌ణంతో తాగుడు మానేశాన‌ని నూత‌న ప్ర‌సాద్ అన్నార‌ని గుర్తు చేసుకున్నారు. కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆయ‌న పేరు మార్చుకున్నార‌ట‌. ఆ విధంగా డిసెంబర్ 18 .. 1977 నుంచి చనిపోయేంత వరకూ మద్యం ముట్టుకోలేదని, అది ఆయన గొప్పతనమని ప‌రుచూరి అన్నారు. ఒకే డైలాగ్ ను ఎన్ని ర‌కాలుగా చెప్ప‌వ‌చ్చో వ‌ర్థ‌మాన న‌టీన‌టుల‌కు ఆయ‌న నేర్పించాడ‌ని అన్నారు. చ‌లి చీమ‌లు లో ఆయ‌న ఒకే డైలాగును అనేక ర‌కాలుగా ట్విస్ట్ చేసి చెప్పార‌ని, ఆ ర‌కంగా చ‌లిచీమ‌ల్లో డైలాగుల‌కు మంచిపేరు వ‌చ్చింద‌ని అన్నారు. ఆ సినిమాను 18 మంది నిర్మాత‌లు త‌లా 10 వేలు వేసుకొని 2 ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించార‌ని, ఆ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కెరీర్ కు మ‌లుపు అయింద‌ని అన్నారు.