ఆ రోజు రోజా చాలా భయపడింది:పరుచూరి

Wed Jun 13 2018 18:00:53 GMT+0530 (IST)


సమకాలీన రాజకీయాల్లోని మహిళా నేతల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. టాలీవుడ్ కోలీవుడ్ లలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రోజా....ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అదే తరహాలో రాణిస్తూ దూసుకుపోతున్నారు. మహిళా సమస్యలపై సత్వరం స్పందిస్తూ....ప్రతిపక్ష నేతగా పాలకపక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ప్రజా సమస్యలపై ధైర్యంగా పోరాడుతోన్న రోజా వాగ్దాటి ముందు అధికార పక్షంలోని ఉద్దండ పిండాలు కూడా బలాదూరనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇపుడు తాను చూస్తున్న రోజాకు....గతంలోని రోజాకు చాలా తేడా ఉందని ప్రముఖ రచయిత నటుడు దర్శకుడు పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. 'ముఠామేస్త్రి' సినిమా లాంచ్ రోజున తన పక్కన భయంభయంగా నిలుచున్న రోజా....నేడు ధైర్యవంతమమైన రాజకీయ నేతగా ఎదిగిన రోజా ఒకరేనా అనిపిస్తోందని అన్నారు. తన యూట్యూబ్ చానెల్లో  ప్రసారమైన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడిని పరుచూరి గోపాలకృష్ణ రోజా గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.శోభన్ బాబు హీరోగా రోజా లీడ్ రోల్ లో పరుచూరి దర్శకత్వం వహించిన 'సర్పయాగం' రోజాకి మంచి పేరు తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఆ సినిమాలో రోజా నటనను చూసిన చిరంజీవి 'ముఠామేస్త్రి' సినిమాలో రోజాకు అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. 'ముఠామేస్త్రి' సినిమా లాంచ్ రోజున చిరంజీవి గారి పక్కన నిలుచునేందుకు రోజా భయపడిందని చెప్పారు. అందుకు తన పక్కన రోజా నిలబడి...తన చేయిని గట్టిగా పట్టుకొని వణికిపోయిందని గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ తన పక్కన నుంచోవాలి కదా అని చిరంజీవి నవ్వుతూ అన్నారని చెప్పారు. తన పక్కన నుంచునే వణికిపోతోందని మీ పక్కన నుంచుంటే ఇంకేమైనా ఉందా అని తాను చిరంజీవితో అన్నానని గుర్తు చేసుకున్నారు. అపుడు తన పక్కన భయంభయంగా నిలబడిన రోజా....నేడు పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా ఇంత దైర్యంగా మాట్లాడుతోందా...అనిపిస్తోందని పరుచూరి అన్నారు.