Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పందెం కోడి-2

By:  Tupaki Desk   |   18 Oct 2018 2:54 PM GMT
మూవీ రివ్యూ : పందెం కోడి-2
X
‘పందెం కోడి-2’ మూవీ రివ్యూ
నటీనటులు: విశాల్-కీర్తి సురేష్-రాజ్ కిరణ్-వరలక్ష్మి శరత్ కుమార్-రాందాస్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: శక్తివేల్
నిర్మాతలు: విశాల్-ధవల్ జయంతిలాల్-అక్షయ్ జయంతిలాల్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లింగుస్వామి

తెలుగువాడైన విశాల్ కు తమిళంలో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ‘సెండైకోళి’. ఆ చిత్రం తెలుగులో ‘పందెంకోడి’ పేరుతో విడుదలై ఇక్కడా విజయం సాధించింది. పుష్కరం తర్వాత ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. లింగుస్వామినే రూపొందించాడు. దసరా కానుకగా మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకుందో చూద్దాం పదండి.

కథ: బాలు (విశాల్) కడప జిల్లాలో కొన్ని ఊర్లు దేవుడిగా కొలిచే రాజా రెడ్డి (రాజ్ కిరణ్) కొడుకు. కొన్నాళ్లు ఫ్యాక్షన్ గొడవల్లో తలమునకలై ఉన్న అతను.. తర్వాత విదేశాలకు వెళ్తాడు. మరోవైపు ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు ముదురుతాయి. ఒక గొడవలో తన భర్త ప్రాణాలు కోల్పోయిన భవాని (వరలక్ష్మి).. రాజా రెడ్డి కుటుంబం కాపాడుతున్న ఓ వ్యక్తిని చంపడానికి కంకణం కట్టుకుని కూర్చుంటుంది. ఇలాంటి సమయంలో బాలు తిరిగి సొంత ఊరికి వస్తాడు. కొన్నేళ్లుగా ఆగిన ఊరి జాతరను వైభవంగా జరిపించి.. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి రాజారెడ్డి ప్రయత్నిస్తుంటే.. భవాని మనుషులు అడ్డం పడుతుంటారు. వారిని అడ్డుకుని తండ్రి సంకల్పాన్ని బాలు ఎలా నెరవేర్చాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మాస్ కథల్ని క్లాస్ కు కూడా నచ్చేలా చెప్పడం దర్శకుడు లింగుస్వామి స్టయిల్. ‘రన్’.. ‘పందెం కోడి’.. ‘ఆవారా’.. వీటన్నింటిలోనూ బోలెడంత యాక్షన్ ఉంటుంది. వాటిలో మాస్ అంశాలకు లోటు ఉండదు. కానీ ఆ కథల్ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసి అందరికీ ఆమోద యోగ్యంగా మార్చాడు లింగుస్వామి. ఎలాంటి ఇమేజ్ లేని విశాల్ ను కూడా ‘పందెంకోడి’లో మాస్ హీరోగా చూపించి మెప్పించాడతను. ఇప్పుడు దీని సీక్వెల్ వచ్చే సమయానికి విశాల్ పెద్ద మాస్ హీరో అయ్యాడు. వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్నాడు. ‘పందెంకోడి-2’ నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారన్నది కూడా లింగుస్వామికి తెలుసు. ఈ అడ్వాంటేజీల్ని అతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ఎపిసోడ్లు.. హీరో ఎలివేషన్ సీన్లు బాగానే సెట్ చేసుకున్నాడు కానీ.. అన్నింటికంటే ముఖ్యమైన కథ విషయంలో మాత్రం లింగుస్వామి సరైన కసరత్తు చేయలేదు.

‘పందెం కోడి’కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది హీరో-విలన్ మధ్య సాగే సంఘర్షణ. హీరో పాత్రను సింపుల్ గా మొదలుపెట్టి.. తర్వాత దాన్ని బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రను కూడా బలంగా తీర్చిదిద్దడం వల్ల సినిమాకు బలమైంది. ఇక ‘పందెంకోడి’ వాస్తవానికి తమిళ కథ అయినప్పటికీ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యానికి బాగానే ముడిపెట్టారు. అది అక్కడ బాగా కుదిరింది. ఐతే ‘పందెంకోడి-2’లో ఇలాంటి ప్లస్ పాయింట్స్ కనిపించవు. ఇక్కడ విలన్ పాత్రలో అంత బలం లేకపోవడం మైనస్ అయింది. హీరో-విలన్ మధ్య డైరెక్ట్ పోరు ఏమీ లేకపోవడం.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చాలా చిన్నది కావడంతో ప్రేక్షకుల్లో ఎమోషన్ ఏమీ ఉండదు. ఇక సినిమా అంతటా హీరోనే అత్యంత బలవంతుడిగా కనిపిస్తాడు. అలవోకగా విలన్ బ్యాచ్ ని రఫ్ఫాడుకుంటూ ఉంటాడు. తనకు తానుగా తగ్గి విలన్లను వదిలేస్తాడు తప్పితే.. అతడికి అటు వైపు నుంచే ఛాలెంజే ఉండదు. మరోవైపు తమిళనాడు పల్లెల్లో జరిగ జాతర నేపథ్యం సినిమా అంతటా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు కొంచెం ఇబ్బందే.

ఐతే ‘పందెంకోడి’కి ఆకర్షణగా నిలిచిన.. యాక్షన్ ఎపిసోడ్లు.. హీరో ఎలివేషన్ సీన్లు.. హీరోయిన్ పాత్ర నేపథ్యంలో సాగే కామెడీ.. రెండో భాగంలోనూ కనిపిస్తాయి. ఇందులో మాస్ ప్రేక్షకులు కోరుకున్నట్లే భారీ పోరాట దృశ్యాలు చూడొచ్చు. వాటిని తీర్చిదిద్దిన విధానం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఒక చోట భారీ స్థాయిలో జాతర జరుగుతుండగా.. ఎవ్వరూ డిస్టర్బ్ కాకుండా రౌడీ బ్యాచ్ పని పడతాడు హీరో. ఆ ఎపిసోడ్ మాస్ కు విందే. పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయొచ్చో లింగుస్వామి ఇక్కడ చూపించాడు. మరోచోట ఓవైపు విశాల్.. మరోవైపు రాజ్ కిరణ్ వేర్వేరు చోట్ల రౌడీల పని పడతారు. దాన్ని కూడా బాగానే డిజైన్ చేశారు.

ఇక ‘పందెంకోడి’లో మీరా జాస్మిన్ పాత్రకు కొనసాగింపులా అనిపించే క్యారెక్టర్లో కీర్తి సురేష్ కూడా వినోదం పంచుతుంది. తన కొడుకు ప్రేమించిన అమ్మాయి ఎవరా అని హీరో తండ్రి చూస్తుండగా.. హీరోయిన్ స్కూటర్ నడుపుతూ దాన్ని గాల్లోకి లేపి సెల్ఫీ దిగుతుంది. ఇంకోచోట హీరోతో కలిసి జీపులో వెళ్తూ వెళ్తూ తను దిగాల్సిన చోట మర్రి ఊడల్ని పట్టుకుని ఎగిరి కిందికి దూకుతుంది. హీరోయిన్ని ఇలాంటి అల్లరి పాత్రలో చూడటం కూడా కొత్తగా అనిపిస్తుంది. ‘మహానటి’ తర్వాత కీర్తికి ఇలాంటి పాత్రలో చూడటమూ భిన్నమైన అనుభూతిని పంచుతుంది. ఐతే ‘పందెంకోడి-2’ నుంచి టార్గెటెడ్ ఆడియన్స్ ఆశించే అంశాలతో దీన్నొక ప్యాకేజీలా అందించిన లింగుస్వామి.. బలమైన కథ మాత్రం తయారు చేసుకోలేకపోయాడు.

కథ పరంగా చూస్తే మాత్రం ‘పందెంకోడి-2’ చెప్పుకోదగ్గ మలుపులు.. విశేషాలేమీ కనిపించవు. చిన్న పాయింటుని బాగా సాగదీశాడు. హీరో ఇంట్లోని ఒక మనిషిని చంపడానికి విలన్లు పదే పదే ప్రయత్నించడం.. హీరో అడ్డుకోవడం.. దీని మీదే సినిమా అంతా సాగడం వల్ల ఒక దశ దాటాక విసుగు పుడుతుంది. ప్రథమార్ధంలో అసలు కథ మొదలవడానికి ముందు హీరోయిన్ పాత్రతో ముడిపడ్డ ట్రాక్ చక్కటి వినోదం పంచుతుంది. ఇంటర్వెల్ ముంగిట యాక్షన్ ఘట్టాలూ ఆకట్టుకుంటాయి. కానీ ద్వితీయర్ధంలో వినోదమే లేకపోవడం.. సీన్లు రిపీటెడ్ గా అనిపించడంతో బోర్ కొడుతుంది. వరలక్ష్మి పోషించిన విలన్ పాత్ర పతాక సన్నివేశం ముందు వరకు సాధారణంగా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘పందెంకోడి-2’లో మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నప్పటికీ.. ‘పందెంకోడి’లా అన్ని వర్గాలకూ నచ్చుతుందా అన్నది సందేహమే.


నటీనటులు: విశాల్ తనకు పర్ఫెక్టుగా సూటయ్యే పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ ఘట్టాల్లో.. ఎలివేషన్ సీన్లలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎక్కడా ఓవర్ ద టాప్ అనిపించకుండా.. లింగుస్వామి స్టయిల్లో సింపుల్ గా తన పాత్రను చేసుకెళ్లాడు విశాల్. కీర్తి సురేష్ కూడా బాగా చేసింది. ఆమె కెరీర్లో మరో గుర్తుంచుకోదగ్గ పాత్ర ఇది. ‘పందెంకోడి’లో మీరా లాగే.. కీర్తి కూడా బలమైన ముద్ర వేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తికిది మేకోవర్ అని చెప్పొచ్చు. డ్యాన్సుల్లో కీర్తి ఎనర్జీ ఆకట్టుకుంటుంది. హీరో తండ్రిగా కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ కూడా మెప్పించాడు. విలన్ గా వరలక్ష్మి పెర్ఫామెన్స్ బాగుంది. పతాక సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికవర్గం: యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతంతో సినిమాకు పిల్లర్ లాగా నిలిచాడు. సినిమా నడతకు తగ్గట్లుగా అతను చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. జాతర నేపథ్యంలో సాగే సన్నివేశాలకు.. యాక్షన్ ఎపిసోడ్లకు అతను నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. పాటలు పర్వాలేదు. శక్తివేల్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మధ్యలో ట్రాక్ తప్పి తన స్థాయికి తగ్గ సినిమాలు తీయని లింగుస్వామి.. ‘పందెంకోడి’ సీక్వెల్లో సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. ప్రధానంగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ సన్నివేశాల మీదే ప్రధానంగా దృష్టిపెట్టాడు. ఐతే అతను కథ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది. మరిన్ని మలుపుల కోసం ప్రయత్నించాల్సింది. ద్వితీయార్ధం మీదా దృష్టిపెట్టాల్సింది. విలన్ పాత్రను తీర్చిదిద్దడంలో లింగుస్వామి తన ముద్ర చూపించలేకపోయాడు.

చివరగా: పందెం కోడి-2.. మాస్ కు మాత్రమే

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre