సల్మాన్ పాక్ జెండా వందనం.. కేసు నమోదు

Sun Nov 18 2018 07:00:01 GMT+0530 (IST)

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాతో ఎలా అయితే తన స్టార్ డంను పెంచుకుంటూ వెళ్తున్నాడో ఆయనపై వివాదాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఎన్నో కేసులు మరెన్నే ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ తాజాగా మరోసారి చిక్కుల్లో పడ్డాడు. సినిమా షూటింగ్ లో భాగంగా పాకిస్తాన్ జెండాను ఎగురవేయడంతో పాటు జెండాకు వందన చేయడంతో వివాదం పెద్దది అయ్యింది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భారత్’ చిత్రంలో ఇండియా పాకిస్తాన్ ల నేపథ్యంలోని కొన్ని సీన్స్ ఉంటాయట. ఆ సీన్స్ ను ఇండియా పాక్ బౌర్డర్ లో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కాని ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితు నేపథ్యంలో అందుకు ఆర్మీ నో చెప్పిందట. దాంతో చేసేది లేక పంజాబ్ లోని ఒక గ్రామం శివారులో భారీ సెట్ ను నిర్మించి అక్కడ చిత్రీకరణ జరుపుతున్నారు. చిత్రీకరణ సమయంలో పాకిస్తాన్ జెండాను సల్మాన్ ఖాన్ ఎగురవేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయుడు అయ్యి ఉండి పాకిస్తాన్ జెండాను ఎగురవేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం మెల్ల మెల్లగా చుట్టు పక్కల గ్రామాలకు తెలియడంతో అంతా కూడా నిరసన తెలిపేందుకు సెట్ వద్దకు చేరుకున్నారు. సల్మాన్ ఖాన్ బస చేస్తున్న హోటల్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళనకారులు గుమ్మిగూడారు. దాంతో ‘భారత్’ చిత్రం షూటింగ్ ను అర్థాంతరంగా ముగించి తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ముంబయికి చేరుకున్నారు. ఆందోళనకారులను అది షూటింగ్ లో భాగం అంటూ శాంతపర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ జెండాను ఎగురవేసి జాతి ద్రోహంకు పాల్పడ్డాడు అంటూ కేసులు నమోదు అవుతున్నాయి.