Begin typing your search above and press return to search.

'పద్మావతి’కి సెన్సార్ బోర్డు ఓకే..భారత్‌ లో కాదు

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:26 AM GMT
పద్మావతి’కి సెన్సార్ బోర్డు ఓకే..భారత్‌ లో కాదు
X
రాజకీయ, సాంస్కృతిక వివాదాల్లో చిక్కుకున్న చిత్రం పద్మావతి విడుదలకు బ్రిటన్‌లో ఆటంకాలు తొలగాయి. భారత్‌ లో ఈ సినిమాను పలు రాష్ట్రాలు నిషేధించడం తెలిసిందే. దాంతోపాటు స్వయంగా చిత్ర నిర్మాతలు కూడా దీని విడుదలను ముందు అనుకున్నట్లు డిసెంబరు 1న కాకుండా వాయిదా వేశారు. అయితే... బ్రిటన్‌ లోనూ విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించి అక్కడి సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇవ్వడంతో డిసెంబరు 1నే అక్కడే విడుదల కానుంది.

సంజయ్‌ లీలా బన్సాలీ పద్మావతి సినిమాను రాజ్‌ పుత్‌ ల మనోభావాలను దెబ్బతినే విధంగా తెరకెక్కించాడని ఆ సామాజిక వర్గం ఇప్పటికీ ఆందోళన చేస్తూనే ఉంది. అధికార బీజేపీ - ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పద్మావతి సినిమా చిక్కుల్లో పడింది.

పైగా కొందరు బీజేపీ నేతలు చిత్ర దర్శకుడికి - హీరోయిన్ దీపికా పదుకునేను చంపితే పారితోషికమిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేయడంతో వివాదం మరింత రాజుకుంది. కర్ణి సేన అయితే దీపికా పడుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్పద ప్రకటన చేసింది. మరోవైపు కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావతి సినిమాను నిషేధిస్తున్నట్లు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పద్మావతి సినిమా లండన్‌ లో విడుదల కానుండడంతో అసలీ సినిమాలో ఏముందన్నది పూర్తిగా బయటకు రానుంది.