Begin typing your search above and press return to search.

ప‌ద్మావ‌తిని.. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు?

By:  Tupaki Desk   |   26 Sep 2017 6:39 AM GMT
ప‌ద్మావ‌తిని.. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు?
X
బాలీవుడ్‌లో భారీ చిత్రాల‌ను తీయడంలో స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ శైలే వేరు. బాలీవుడ్ మాజీ ప్రేమికులు స‌ల్మాన్ ఖాన్ - ఐశ్వ‌ర్యారాయ్‌ హీరోగా న‌టించిన హ‌మ్‌ దిల్ దే చుకే స‌న‌మ్‌ - షారుక్ ఖాన్ హీరోగా న‌టించిన దేవ‌దాస్‌ - బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించిన బ్లాక్‌ - బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు ర‌ణ్‌ వీర్ సింగ్‌ - దీపిక న‌టించిన రామ్‌ లీలా - బాజీరావు మ‌స్తానీ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు బాలీవుడ్ నెంబ‌ర్‌ వ‌న్ హీరోయిన్‌ - పొడుగు కాళ్ల సుంద‌రి దీపికా ప‌దుకొణేను హీరోయిన్‌ గా పెట్టి ప‌ద్మావ‌తి పేరుతో ఒక చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నసంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తికావ‌స్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్‌ లో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. రాజ‌స్థాన్‌ లో ఈ చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా ప‌ద్మావ‌తిని అవ‌మానిస్తూ సినిమాను చిత్రీక‌రిస్తున్నార‌ని రాజ‌పుత్రులు సంజ‌య్‌ పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్నివిడుద‌ల కానీయమంటూ రాజ‌పుత్రులు భ‌న్సాలీకి వార్నింగ్‌ లు ఇస్తున్నారు. ఇంత వివాదాస్ప‌ద‌మైన చిత్రంలో అస‌లు క‌థేంటి?

ప‌ద్మావ‌తి అస‌లు పేరు.. ప‌ద్మిని. ఈమె రాజ‌స్థాన్‌ లోని మేవార్‌ రాజ్యాన్ని పాలించిన రాజ‌పుత్ర‌ రాజా ర‌త‌న్ సేన్ భార్య‌. అందంలో చంద‌మామ అని, ఆమెను చూస్తే వెన్నెల కూడా ముచ్చ‌ట‌ప‌డుతుంద‌ని ఆనాటి క‌వులు ఆమె అందాన్ని వ‌ర్ణించారు. 720 సంవ‌త్స‌రాల‌ కింద‌ట అంటే క్రీ.శ‌1303 సంవ‌త్స‌రంలో ఈ క‌థ జ‌రిగింది. అప్పుడు ఢిల్లీని మ‌ధ్య ఆసియా (ఇరాన్‌ - ఇరాక్‌ - సౌదీ అరేబియా - తుర్క్‌ మెనిస్థాన్ త‌దిత‌ర‌) దేశాల నుంచి వ‌చ్చార‌ని భావిస్తున్న సుల్తానులు పాలిస్తుండేవారు. వీరిలో ఖిల్జీ వంశ‌స్తుల్లో అగ్ర‌గ‌ణ్యుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తాన్‌ గా ఉన్నాడు. సుల్తాన్ సామ్రాజ్యంలో రాజ‌పుత్ర రాజ్యం అంటే మేవార్ లేదా మేవాడ్ మిన‌హాయించి మ‌న తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు దేశ‌మంతా ఉండేది. మ‌న తెలుగు పాల‌కులైన కాక‌తీయ ప్రతాప‌రుద్రుడిని ఓడించి కాక‌తీయ సామ్రాజ్యాన్ని కూడా ఖిల్జీ సామ్రాజ్యంలో క‌లిపేశాడు ఖిల్జీ సేనాని మాలిక్ కాఫ‌ర్‌.

మేవాడ్‌ను ఎలాగైనా జ‌యించి త‌న ఆధిప‌త్యాన్ని చాటుకోవాల‌నుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అంతేకాకుండా మేవాడ్ రాణి ప‌ద్మావ‌తి అపురూప‌మైన అందాల రాశి అని నిఘా వ‌ర్గాల ద్వారా తెలుసుకున్నాడు. దీనికి తోడు మేవాడ్ రాజ్యం నుంచి బ‌హిహ్కృతుడైన ఒక రాజ‌ద్రోహి ఖిల్జీ పంచ‌న చేరి యుద్ధానికి రెచ్చ‌గొడుతూ ఉంటాడు. అదేప‌నిగా రాణి పద్మిని అంద‌చందాల గురించి వ‌ర్ణిస్తుండ‌టంతో ఆమెను ఎలాగైనా ద‌క్కించుకోవాల‌నుకుంటాడు ఖిల్జీ. దీనికోసం మేవాడ్ రాజు రత‌న్ సేన్ ద‌గ్గ‌ర‌కు రాయ‌బారుల‌ను పంపుతాడు. రాణి ప‌ద్మావ‌తిని అప్ప‌గిస్తే యుద్ధం త‌ప్పుతుంద‌ని - ప్రాణ న‌ష్టం ఉండ‌ద‌ని రాయ‌బారులు ఖిల్జీ మాట‌గా చెబుతారు. దీనిపై ఎన్నో ర‌కాలుగా ఆలోచించిన రత‌న్ సేన్.. ప్రాణ న‌ష్టం లేకుండా చేయ‌డానికి ఆమెను ఖిల్జీకి అప్ప‌గిస్తాడ‌నే క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది.

ఇంకొంత‌మంది క‌వులు రాసిన దాని ప్ర‌కారం ఖిల్జీ - ర‌త‌న్‌ సేన్ మ‌ధ్య యుద్ధం జ‌రిగింద‌ని, ఈ యుద్ధంలో ర‌త‌న్ సేన్ ఓడిపోయాడ‌ని.. ప‌ద్మిని రాజ‌పుత్ర స్త్రీల‌తో క‌లిసి అగ్నిప్ర‌వేశం చేసింద‌ని ఉంది. ఇంకో క‌థ‌లో రాణి ప‌ద్మావ‌తి అంద‌చందాలు చూసి వెళ్లిపోతాన‌ని ఖిల్జీ కోరిన‌ట్లు దానికి ర‌త‌న్‌ సేన్ ఒప్పుకొన్న‌ట్లు.. అయితే ప‌ద్మావ‌తి మాత్రం ఒక పెద్ద అద్దం ఎదురుగా తాను నుంచుంటాన‌ని, ఆందులో త‌న ప్ర‌తిబింబాన్ని వెళ్లిపోవాల‌ని ష‌రతు పెట్టిందని మ‌రో క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. మ‌రి భ‌న్సాలీ వీటిల్లో దేన్ని బేస్ చేసుకుంటాడో చూడాలి. కాగా ప‌ద్మావ‌తిగా సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది దీపికా ప‌దుకొనే - అల్లావుద్దీన్ ఖిల్జీగా దీపికా నిజ జీవిత ప్రేమికుడు ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించ‌నుండ‌టం గ‌మ‌నార్హం. ప‌ద్మావ‌తి భ‌ర్త రాజా ర‌త‌న్ సేన్‌ గా హీరో షాహిద్ క‌పూర్ న‌టిస్తున్నాడు. చూద్దాం విడుద‌ల‌య్యాక ఎన్ని వివాదాలు చుట్టుముడ‌తాయో!