ట్రైలర్ టాక్: పడినా గెలిచిన మనసు

Fri Dec 14 2018 16:13:56 GMT+0530 (IST)

శర్వానంద్ - సాయి పల్లవి కాంబోలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పడి పడి లేచే మనసు ట్రైలర్ ఇందాకా గ్రాండ్ లాంచ్ లో విడుదలైంది.డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ మూవీపై ప్రత్యేకించి యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విషయానికి వస్తే కథ చూచాయగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు హను రాఘవపూడి. సూర్య(శర్వానంద్)మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయి వైశాలి(సాయి పల్లవి). సరదాగా మొదలైన ఈ పరిచయం ఎన్నో మధురమైన జ్ఞాపకాల మధ్య ప్రేమగా మారుతుంది. అయితే అనూహ్యంగా జరిగిన ఏవో సంఘటనల కారణంగా ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుంది.రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధ పడిన టైంలో వైశాలి సూర్యకు బ్రేక్ అప్ చెబుతుంది. సూర్య జీవితంలో అగాధం మొదలవుతుంది. ఏడాది తర్వాత తన ప్రేమను తిరిగి అన్వేషిస్తూ బయలుదేరతాడు. అసలు అంత ఘాడంగా ప్రేమించుకున్న సూర్య వైశాలి మధ్య ఎందుకు దూరం పెరిగింది వైశాలి తానుగా సూర్యపై అయిష్టం పెంచుకునే పరిస్థితి వచ్చింది అనేదే పడి పడి లేచే మనసు. ట్రైలర్ లో తనకు మాత్రమే ప్రత్యేకమైన టేకింగ్ స్టైల్ ని చూపించాడు దర్శకుడు హను రాఘవపూడి. శర్వా సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అనిపించడమే కాదు స్క్రీన్ పై కూడా వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ట్విస్ట్ ని ఎక్కడా రివీల్ చేయకుండా కట్ చేసిన ట్రైలర్లో  కేవలం సూర్య వైశాలిల మధ్య ప్రేమ కథను మాత్రమే చూపించారు.

ఈ ఇద్దరు తప్ప కనిపించిన మూడో ఆర్టిస్టు హీరో ఫ్రెండ్ గా నటించిన ప్రియదర్శి మాత్రమే. కొత్త హెయిర్ స్టైల్ తో పాటు కొత్త మ్యానరిజం తో శర్వా డిఫరెంట్ గా ఉన్నాడు. స్వంత డబ్బింగ్ తో సాయి పల్లవి మెడికో స్టూడెంట్ గా పర్ ఫెక్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే పాత్రను మరోసారి దక్కించుకుంది. జెకె ఛాయాగ్రహణం కోల్కతా బ్యాక్ డ్రాప్ ని చక్కగా ప్రెజెంట్ చేయగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది. మొత్తానికి పడినా గెలిచేలా ఉన్న ట్రైలర్ అంచనాలు పెంచిన మాట నిజం