ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ గా 'సాహో?

Fri Aug 10 2018 19:31:48 GMT+0530 (IST)

`బాహుబలి`తర్వాత ప్రభాస్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలిపాత్రలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకులు ఫిదా అయ్యారు. దీంతో బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తోన్న సాహో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం....అదే స్థాయిలో వసూళ్లు రాబడుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ అల్ట్రా మోడర్న్ గా ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఆసక్తికర సమాచారం లీకులు వస్తున్నాయి. `సాహో`లో ప్రభాస్ ఓ అంతర్జాతీయ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడని పుకార్లు వస్తున్నాయి. ధూమ్ లో హృతిక్ తరహాలో రెప్పపాటులో కోట్లు కొల్లగొట్టే దోపిడీ దొంగలా ప్రభాస్ నటిస్తున్నాడని టాక్ వస్తోంది.అంతర్జాతీయ వజ్రాల దొంగ అయిన ప్రభాస్ కోసం ఇంటర్ పోల్ అధికారులు తెగ గాలిస్తుంటారట. ఈ తరమాలో సోషల్ మీడియాలో....టాలీవుడ్ లో రూమర్స్ వస్తున్నాయి. అయితే పలు దేశాల్లోని పురాతన వజ్రాలను ప్రభాస్ ఎందుకు దొంగిలిస్తున్నాడనేది సస్పెన్స్ అట. ఇక ప్రభాస్ ఆటకట్టించేందుకు అపాయింట్ అయిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ చాలా కీలకమైందట. 3 నెలల పాటు దుబాయ్ లో యాక్షన్ పార్ట్ కు అయిన ఖర్చుతో....టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమా పూర్తి చేయచ్చట. ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉండబోతోందట. ప్రస్తుతం రొమేనియాలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టి....వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది.