సిల్క్ స్మితపై కన్నేసిన పా.రంజిత్

Wed Aug 15 2018 10:49:15 GMT+0530 (IST)

రెండే రెండు సినిమాల అనుభవంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు పా.రంజిత్. అతడితో చేసిన తొలి సినిమా ‘కబాలి’ నిరాశ పరిచినా మళ్లీ ఆశ్చర్యకరంగా ఇంకో అవకాశం ఇచ్చాడు సూపర్ స్టార్. కానీ ‘కాలా’ కూడా ఆడలేదు. దీంతో రంజిత్ కెరీర్ ప్రమాదంలో పడటం ఖాయం అనుకున్నారంతా. కానీ అతను బాలీవుడ్లో తన తర్వాతి సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రంజిత్ తో సినిమాను నిర్మించనుంది. ఇంకా ఆ చిత్రానికి హీరో ఎవరన్నది ఖరారు కాలేదు. ఈలోపు పా.రంజిత్ మరో ఆసక్తికర ప్రాజెక్టును దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అతను దివంగత నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా భారీ వెబ్ సిరీస్ చేయబోతున్నాడట. ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఈ బాధ్యతలు అతడికి అప్పగించినట్లు సమాచారం.సిల్క్ స్మిత జీవితంపై ఇప్పటికే హిందీలో ‘డర్టీ పిక్చర్’ సినిమా వచ్చింది. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టయింది. ఐతే అందులో స్మిత జీవితాన్ని ఉన్నదున్నట్లు చూపించలేదు. అందులో చాలా వరకు ఫిక్షనే కనిపిస్తుంది. స్మిత జీవితంలోని చాలా అంశాలు అందులో కవర్ కాలేదు. ఐతే పా.రంజిత్ దానికి భిన్నంగా స్మిత జీవితాన్ని పూర్తిగా.. వక్రీకరణ లేకుండా వెబ్ సిరీస్లో చూపించనున్నాడట. సిల్క్ స్మిత కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందట. 80ల్లో దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపిన తార సిల్క్ స్మిత. ఆమె పలుభాషల్లో కలిపి 450కి పైగా సినిమాలు చేయడం విశేషం. ప్రధానంగా ఆమె వ్యాంప్ క్యారెక్టర్లే చేసింది. హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ ఇమేజ్ సంపాదించుకున్న స్మిత.. చాలా తక్కువ వయసులోనే మరణించింది. మరి ఆమె జీవితాన్ని రంజిత్ ఎలా ఆవిష్కరిస్తాడో చూడాలి.