నిర్మాతలవుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు!

Sat Aug 11 2018 07:00:26 GMT+0530 (IST)

సినిమా వ్యాపారం అంటే అంతే. ఎవరు వచ్చినా అంతిమ లక్ష్యం ఒకటే లాభాలు చేసుకోవడం. ఎంత ప్యాషన్ ఉన్నప్పటికీ ఇక్కడ పెట్టుబడి మీద ఎంత గిట్టుబాటు అవుతుంది అనే దాని మీదే ప్రతి నిర్మాతా లెక్కలు వేసుకుంటాడు. ఇప్పుడు తెలుగు సినిమా పరిధి పెరుగుతోంది. గత నాలుగేళ్లుగా గమనిస్తే బాలీవుడ్ కు ధీటుగా అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాహుబలితో ఇది పీక్స్ కు చేరుకుంది. అఆ-అర్జున్ రెడ్డి లాంటి బడ్జెట్ సినిమాలు సైతం మిలియన్ డాలర్ల వసూళ్లు ఈజీగా రాబట్టడం చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మెల్లగా నిర్మాతల అవతారం ఎత్తుతున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు టాప్ బ్యానర్స్ లో ఒకటిగా నిలుస్తూ మొదటి మూడు సినిమాలు స్టార్ హీరోస్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అక్కడి డిస్ట్రిబ్యూటర్లే. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులకు కూడా మంచి గురి ఉంది. శ్రీమంతుడు-జనతా గ్యారేజ్-రంగస్థలం వసూళ్లు దీన్ని రుజువు చేశాయి.ఇప్పుడు నిర్వాణ కూడా ఇదే దారిలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ప్రొడక్షన్ లో దిగబోతున్నట్టు తెలిసింది.హీరో దర్శకుడు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. వీళ్ళే కాదు ఇంకొందరు కూడా ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్. దీనికి కారణం ఒకటే. ఓవర్ సీస్ అందులోనూ అమెరికా మార్కెట్ భారతీయ సినిమాలకు విసృతంగా మారుతోంది. టాక్ బాగా వస్తే చాలు వసూళ్ల వర్షం కురుస్తోంది. హీరో ఎవరు అనే కోణంలో కాకుండా సినిమా బాగుందా అనే యాంగిల్ లో అక్కడి ప్రేక్షకులు సినిమాలు చూస్తుండటం వల్ల స్క్రిప్ట్ స్టేజి లోనే వాళ్ళ అభిరుచిని గుర్తు పెట్టుకుని మరీ జాగ్రత్తలు తీసుకుంటున్న దర్శక నిర్మాతలు ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఓవర్ సీస్ ఇప్పుడు బంగారు  బాతులా మారింది. గుడ్లను కొని అమ్ముకోవడం కంటే బాతునే పెంచుకుని గుడ్లు మన సొంతం చేసుకుంటే ఇంకా ఎక్కువ  లాభాలు వస్తాయి కదా అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు. అయినా ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటి సినిమా వ్యాపారం. రిస్క్ కూడా ఉంటుంది. అది జాగ్రత్తగా డీల్ చేసినంత ఎలాంటి సమస్యలూ రావు.