Begin typing your search above and press return to search.

సూర్యాను చూసి మన స్టార్లు నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:08 PM GMT
సూర్యాను చూసి మన స్టార్లు నేర్చుకోవాలి
X
సూర్య కొత్త సినిమా ‘గ్యాంగ్’కు మంచి టాకే వచ్చినా తొలి రోజు.. తొలి వారాంతంలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. అయినప్పటికీ సూర్య అండ్ కో ఏం చేస్తాంలే అని ఊరుకోలేదు. సూర్య నేరుగా రంగంలోకి దిగిపోయాడు. తెలుగు వాళ్ల మాదిరే తమిళులకు కూడా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. ఆ రోజు అందరూ ఇంటిపట్టునే ఉంటారు. కానీ సూర్య మాత్రం ఆంధ్రా ఏరియాలో థియేటర్లను చుడుతూ గడిపాడు సోమవారం. అతడి సినిమా తమిళంలోనూ విడుదలైంది. అక్కడి మార్కెట్ అతడికి మరింత ముఖ్యం. ఐతే అక్కడ టాక్‌ కు తగ్గట్లే వసూళ్లున్నాయి. కానీ తెలుగులో అలా కాదు.

పోటీగా వచ్చిన తెలుగు సినిమాలు బ్యాడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘గ్యాంగ్’ అడ్వాంటేజీని ఉపయోగించుకోలేకపోతోందని.. టాక్ కు తగ్గట్లు వసూళ్లు లేవని ఆందోళన చెంది సూర్య ఇక్కడ దిగిపోయాడు. పండుగ రోజు కుటుబాన్ని విడిచిపెట్టి ఇక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మార్కెట్ పెంచుకోవడానికే కదా ఇలా చేస్తున్నాడు అనుకోవచ్చు కానీ పారితోషకం పుచ్చుకున్నాక సినిమా ఏమైతే తమకేమైందనుకునే హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ సూర్య అలా కాకుండా నిబద్ధతతో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అతడి ప్రయోజనాల కంటే కూడా ఇక్కడ తన సినిమాను కొన్న నిర్మాత శ్రేయస్సు గురించి కూడా అతను ఆలోచిస్తున్న మాట వాస్తవం.

అభిమానులకు కోపం వస్తే రావచ్చు కానీ.. ఈ సంక్రాంతికే విడుదలై పేలవమైన టాక్ తెచ్చుకుని దారుణమైన వసూళ్లతో భారంగా సాగుతున్న ‘అజ్ఞాతవాసి’ని హీరో పవన్ కళ్యాణ్ కానీ.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ రక్షించే ప్రయత్నం ఏదీ చేయలేదు. విడుదలకు ముందైతే సినిమాకు మాంచి హైప్ ఉంది కాబట్టి వాళ్లు సైలెంటుగా ఉన్నా ఇబ్బంది లేదు. కానీ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుని దారుణమైన వసూళ్లతో సాగుతున్నపుడు.. భారీ నష్టాలు తప్పేలా లేనపుడు.. బయ్యర్ల జీవితాలే తారుమారైపోయే పరిస్థితి ఉన్నపుడు వాళ్లు కొంచెం కదలాల్సింది. ప్రమోషన్ సినిమాకు హిట్ చేసేయకపోవచ్చు. కానీ ఎంతో కొంత నష్టాలు తగ్గించేందుకు.. లాభాల్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఈ విషయాన్ని హీరోలందరూ గుర్తిస్తే మంచిది.