Begin typing your search above and press return to search.

టిఆర్పి రేటింగులకు గండి పడుతోంది

By:  Tupaki Desk   |   11 Jun 2019 6:54 AM GMT
టిఆర్పి రేటింగులకు గండి పడుతోంది
X
ఒకప్పుడు టీవీ ఛానల్ లో కొత్త సినిమా ప్రసారం అవుతోంది అంటే దాని క్రేజ్ వేరుగా ఉండేది. ఏకంగా థియేటర్లో వస్తున్నంత హడావిడి ఇళ్లల్లో కనిపించేది. దూరదర్శన్ ప్రభావం తగ్గిపోయి జెమినీ- ఈటీవీ లాంటి శాటిలైట్ ఛానెళ్ల రాక మొదలయ్యాక జనం దైనందిన జీవితంలో ఇవొక భాగంగా మారిపోయాయి. విపరీతమైన ఆదరణ ఉంది కాబట్టే ఛానల్స్ యాజమాన్యాలు ఎంత ధర అయినా లెక్కచేయకుండా హక్కుల కోసం పెట్టుబడులు పెట్టేవి.

దానికి తగ్గట్టే రేటింగ్స్ యాడ్స్ ప్రాఫిట్స్ వచ్చేవి. జేబులు నిండిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి గమిస్తూ ఉంటే ఇదంతా గత చరిత్ర మారే రోజులు దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తోంది. 4జి టెక్నాలజీ వచ్చాక డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. జనం టీవీలు వదిలేసి స్మార్ట్ ఫోన్లు ల్యాప్ టాప్స్ లో సినిమాలు చూడటం అలవాటు చేసుకుంటున్నారు

అందులోనూ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాక ఇది ఇంకా విస్తృతంగా మారింది. ఫలితంగా గంటల కొద్దీ టీవీల ముందు కూర్చుని యాడ్స్ ని భరిస్తూ కొత్త సినిమాలు చూసే ప్రేక్షకులు రాను రాను తగ్గిపోతున్నారు. మాములుగా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా టీవీలో వచ్చే ఏ సినిమా అయినా భారీ రేటింగ్స్ తెచ్చుకోవడం సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో మొదటి సార్లు ప్రీమియర్లు వేయబడ్డ మణికర్ణిక- అంతరిక్షం - నీవెవరో - ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోలేకపోయియి.

6 లోపే వీటికి టిఆర్పి రావడం బట్టి పరిస్థితి అర్థమవుతోంది. ఇవన్నీ టీవీలో రావడానికి కనీసం రెండు నెలల ముందే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో హెచ్డి క్లారిటీతో అందుబాటులోకి రావడాన్ని మర్చిపోకూడదు. చూస్తుంటే ఇదిలాగే కొనసాగితే శాటిలైట్ మీద భారీ ఆశలు పెట్టుకునే నిర్మాతలకు ఇది ఆశనిపాతంగా మారుతుంది. ఒకవేళ దీంట్లో తగ్గినా కల్పతరువుగా మారిన డిజిటిల్ సంస్థలు ఉండనే ఉన్నాయి. ఎటొచ్చి చిక్కంతా సదరు ఛానళ్లకే