ట్రైలర్ టాక్: మోహనుడి సమ్మోహనం

Sun Dec 09 2018 16:02:11 GMT+0530 (IST)

కంప్లీట్ యాక్టర్ గా మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న మోహన్ లాల్ కొత్త సినిమా ఓడియన్ విడుదలకు రెడీ అవుతోంది. కేరళలో భారీ అంచనాలు ఉన్న ఈ మూవీని అక్కడి తేదిలోనే ఇక్కడ కూడా డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి రెండు  రాష్ట్రాల్లో ఇలా విడుదల అవుతున్న మోహన్ లాల్ డబ్బింగ్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే చీకటికి రారాజుగా ఓడియన్ పాత్ర లక్షణాన్ని వివరిస్తూ మొదట్లోనే ఒక డైలాగ్ చెప్పించారు.టీ తాగుతూ తన మీదకు దాడికి వచ్చిన రౌడీలను చితకొట్టడం తనలో మరో రూపం ఉందని దాన్ని చూస్తే తట్టుకోలేరని భయపెట్టడం ఏదో థ్రిల్లర్ తరహా ఫీలింగ్ కలిగించింది. ఓడియన్ వన్ మ్యాన్ షో. ఇందులో వివిధ రకాల వయసుల్లో కనిపించే పాత్రల కోసం చాలా కష్టపడ్డాడు మోహన్ లాల్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఓడియన్ లో ప్రకాష్ రాజ్-రావికొండల రావు లాంటి తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మంజు వారియర్ హీరొయిన్ గా నటించిన ఓడియన్ పీరియాడిక్ మూవీగా చెప్పబడుతోంది.

విద్యుత్ సౌకర్యం రాక మునుపు కేరళ మలబార్ ప్రాంతంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఇది రూపొందిచారట. మనిషి నుంచి జంతువు రూపంలో మారే విచిత్రమైన లక్షణమున్న పాత్రలో  మోహన్ లాల్ షాక్ ఇచ్చే పెర్ఫార్మన్స్ ఇచ్చారని ఇప్పటికే టాక్ ఉంది. ఆరు పదుల వయసులో తన విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్న మోహన్ లాల్ ఓడియన్ డిసెంబర్ 14న విడుదల కానుంది.