మహేష్ సూపర్ ప్లెక్స్ కి నోటీస్?

Wed Feb 20 2019 09:45:05 GMT+0530 (IST)

గత ఏడాది ఎంతో ఆర్భాటంగా మొదలైన హైదరాబాద్ ఎఎంబి సినిమాస్ సూపర్ ప్లెక్స్ మూవీ లవర్స్ కి ఇప్పటికే ఫేవోరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది. ఒక్కసారైనా ఇందులో సినిమా చూసిన అనుభూతిని పొందాలన్న తాపత్రయం సెలెబ్రిటీలు మొదలుకుని సామాన్యుల వరకు అందరికి ఉంది.అందుకే దూరంతో సంబంధం లేకుండా గచ్చిబౌలిలో ఉన్న ఈ థియేటర్ సముదాయానికి జనం బాగా వస్తున్నారు. అయితే జి ఎస్ టి నిబంధలను పాటించని కారణంగా ఈ సూపర్ ప్లెక్స్ కు నోటీసులు వచ్చాయన్న ఓ ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ కథనం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ బాగా చక్కర్లు కొడుతోంది.

దాని  ప్రకారం సినిమా టికెట్ రేట్లకు సంబంధించి జిఎస్టి కౌన్సిల్ పలు మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 100 రూపాయల కంటే ఎక్కువగా ధర ఉన్న టికెట్ల మీద 28 శాతం ఉన్న పన్నుని 18  శాతానికి తగ్గించారు. ఇది జనవరి 1 నుంచే అమలులోకి వచ్చింది. వంద కంటే ధర తక్కువగా ఉంటె 18 నుంచి 12 శాతానికి తగ్గించింది

అయితే ఎఎంబి సినిమాస్ లో మాత్రమే పాత ధరలతోనే టాక్స్ వేసి టికెట్లు అమ్ముతున్నారన్న అభియోగం మీద రంగా రెడ్డి జిఎస్టి కమిషనరేట్ పలు మల్టీ ప్లెక్సులు సందర్శించి ప్రత్యక్షంగా టికెట్లు కొని ఆధారాలు సంపాదించాకే నోటీసులు పంపినట్టు సమాచారం. 2017లో అమలులోకి వచ్చిన జిఎస్టి యాక్ట్ సెక్షన్ 171 కింద ఇవి పంపినట్టు టాక్.

ఇది అధికారికంగా తెలియకపోయినా ప్రముఖ ఇంగ్లీష్ డైలిలో రావడంతో వేగంగా వైరల్ అయిపోయింది. నిజానికి హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని మల్టీ ప్లెక్సులు ఈ సవరణలు  చేసుకున్నాయి. అందువల్లే ఆన్ లైన్ లో కూడా తగ్గిన మారిన ధరలు కనిపిస్తున్నాయి. కానీ ఎఎంబి సినిమాస్ లో ఇది జరగలేదు అనేదే ప్రస్తుత నోటీస్ లోనే సమాచారం. మరి దీని గురించి మహేష్ క్యాంప్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో వేచి చూడాలి