నార్త్.. సౌత్ ఫీలింగ్ బాహుబలి మీద పడిందా?

Fri Apr 21 2017 10:15:24 GMT+0530 (IST)

మొన్నటి వరకూ షూటింగ్ హడావుడి. ఆ తర్వాత పెండింగ్ వర్క్ కంప్లీట్ మీద ఫోకస్. ఇలా ఊపిరి సలపనంత పనితో బాహుబలి 2 ప్రచారం విషయంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. మొదటి భాగం రిలీజ్ కు ఆరు రోజుల ముందు ఉన్న పరిస్థితి.. ఇప్పటి పరిస్థితిని పోల్చి చూస్తే.. తేడా ఇట్టే అర్థమవుతుంది. అయితే.. మొదటి పార్ట్ విడుదల సమయంలో తుది ఫలితం మీద ఉన్న ఉత్కంటతో.. ప్రచారం మీద మరింత ఫోకస్ చేయటం జరిగింది. ఇక.. ఈసారి అలాంటి జోరు కాస్త తక్కువనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే వందల కోట్ల రూపాయిల ప్రచారం బాహుబలికి మీడియా అందించిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

విషయం చెప్పకుండా.. సినిమా మీద అంతకంతకూ ఆసక్తిని పెంచేలా చెప్పటం కాస్త ఇబ్బందే. దీన్ని విజయవంతంగా డీల్ చేయటంలో జక్కన్న టీం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దీంతో.. ఇప్పటికే తమకొచ్చిన ప్రచారం బాహుబలి2కు సరిపోతుందని జక్కన్న ఫీల్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక.. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్  విడుదల విషయంలో ఓ పెద్ద గ్యాప్ జక్కన్న అండ్ కోను ఆందోళనకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలో నార్త్ లో ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవని.. కానీ.. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని.. ఒక సౌత్ సినిమాకు ఇంత బజ్ అవసరమా? అన్నట్లుగా అక్కడి సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. బహుబలి 2కు అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా అండర్ కరెంట్ గా ఒక మెసేజ్ పాస్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.

ఈ కారణంగానే ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలో సాగినంత ప్రచారజోరు సెకండ్ పార్ట్  రిలీజ్ లో కనిపించటం లేదంటున్నారు. దీనికి తోడు.. ఈ సినిమా కలెక్షన్ల లక్ష్యం వెయ్యి కోట్ల మాట బయటకు రావటం బాహుబలి 2కు కొత్త కష్టాల్ని తెచ్చి పెడుతుందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఒక సౌత్ మూవీ వెయ్యి కోట్ల కలెక్ట్ చేస్తుందన్న మాట మరీ ఎక్కువగా ఉందని.. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని బాలీవుడ్ దిగ్గజాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

అందుకే.. బాహుబలి2 ను వీలైనంత వరకూ అండర్ ప్లే చేయాలే తప్పించి.. ఎక్కడా ఎలివేట్ చేయటానికి బాలీవుడ్ వర్గాలు ఇష్టపడటం లేదన్నది తాజా సమాచారం. దీనికి ఉదాహరణగా ముంబయిలో ఈ మూవీకి నిర్వహించిన ఫంక్షన్ కు వచ్చిన ప్రముఖులే నిదర్శనంగా చెబుతున్నారు. ఇందులో వాస్తవాలు ఎంతన్నది రానున్న రోజులు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/