ఓటరు ఎక్కడ విష్ణూ?

Fri Aug 10 2018 07:00:27 GMT+0530 (IST)

మంచు హీరోలకు బాగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఏది ముట్టుకున్నా కాలిపోతోంది తరహాలో ఎవరితో చేసినా ఫలితం మాత్రం ఒకేలా వస్తోంది. ఇప్పటికే మనోజ్ బ్రేక్ తీసుకోగా థ్రిల్లర్ ట్రై చేసినా లక్ష్మి ప్రసన్నకు కలిసి రాలేదు. విష్ణు పరిస్థితి వీరికి భిన్నంగా ఏమి లేదు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటుతున్నా ఢీ-దేనికైనా రెడీ లాంటి ఒకటి రెండు తప్ప ఘనంగా చెప్పుకోలేని హిట్స్ ఎక్కువ లేకపోవడం మంచు హీరోను బాగా ఇబ్బంది పెడుతోంది. తండ్రి మోహన్ బాబు బ్యాక్ అప్ ఎంత ఉన్నా స్వంతంగా సినిమాలు తీసినా ఏవి ఫలితాన్ని ఇవ్వలేదు. విష్ణు ఈ మధ్య చేసిన ఆచారి అమెరికా యాత్ర ఏమైందో తెలిసిందే. వారం తిరక్కుండానే వెనక్కు వచ్చేసింది. దీంతో పాటు విష్ణు ఓటర్ అనే సినిమాను మొదలుపెట్టుకున్నాడు. షూటింగ్ కూడా జరుగుతూ ఉండింది. మధ్యలో ఓసారి ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ వెరైటీ డిజైన్ తో ఒకటి వదిలారు. ఏదో విషయం ఉన్నట్టుందే అనుకున్నారు అందరు. కానీ దాని తర్వాత మాత్రం అప్ డేట్ పూర్తిగా ఆగిపోయింది. విష్ణు సోషల్ మీడియాలో సైతం ఏమంత యాక్టివ్ గా లేడు.జిఎస్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తమిళ్ లో కురాల్ 388 పేరుతో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. హీరోయిన్ గా సురభి నటిస్తున్నట్టు కూడా ప్రకటించారు. మ్యూజిక్ కోసం తమన్ ను సెట్ చేసుకున్నారు. ఇప్పుడు మంచు ఫ్యాన్స్ కు వస్తున్న డౌట్ ఒకటే. అసలు ఓటరు వస్తుందా అని. షూటింగ్ మొదలుపెట్టి ఏడాది దాటినా కనీస సమాచారం లేకుండా టీజర్ అయినా విడుదల చేయకుండా ఉండటం చూస్తుంటే ఆగిపోయిందేమో అనే అనుమానం రాక మానదు. దానికి సమాధానం విష్ణుకు మాత్రమే తెలుసు కానీ ఈ మధ్య బయట కూడా కనిపించడం మానేసాడు. ఎలాగూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు విడుదల చేస్తే కలిసి వస్తుంది అనుకున్నారేమో. అలా అయితే ఇంకో ఆరు నెలల దాకా ఛాన్స్ లేదు. కానీ బాగా గమనిస్తే ఓటర్ ఆగిపోయింది అన్న పుకారుకే బలం కలిగేలా ఉంది. ఏదైనా మంచు హీరోగా తానుగా చెబితే బెటర్.