Begin typing your search above and press return to search.

2.0 చప్పుడు లేదేంటబ్బా?

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:38 AM GMT
2.0 చప్పుడు లేదేంటబ్బా?
X
సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమాకైనా హీరో ఎవరు అనేదానితో సంబంధం లేకుండా పబ్లిసిటీ చేసుకోవడం చాలా అవసరం. అమితాబ్ తో మొదలుకుని చిన్న కమెడియన్ దాకా అందరికి ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం దగ్గరి నుంచి విడుదల రోజు దాకా ప్రతి విషయంలోనూ నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పిఆర్ వ్యవస్థ ఇంత బలంగా మారడానికి ప్రధాన కారణం ఇదే. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ ల కాంబోలో రూపొందిన ఇండియాస్ మోస్ట్ కాస్ట్ లీ మూవీగా చెప్పుకుంటున్న 2.0 విషయంలో మాత్రం ఆ సందడి ఏ మాత్రం కనిపించడం లేదు.

చెన్నై లో చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తప్ప ఇంకేదీ గ్రాండ్ గా చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ తో పాటు వీడియో సాంగ్ ప్రదర్శన అంటూ మీడియాను పిలిచారు కాని 2.0 రేంజ్ కు తగ్గ వేడుక చేసే సూచనలు కనిపించడం లేదు. లైకా ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఎందుకింత స్తబ్దుగా ఉందనేది ట్రేడ్ కు సైతం అంతు చిక్కడం లేదు. ఒక్క తెలుగు వెర్షన్ మీదే 80 కోట్ల దాకా పెట్టుబడులు జరిగాయని ఇన్ సైడ్ టాక్. కర్ణాటకలో సైతం కనివిని ఎరుగని స్థాయిలో 35 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. ఇది శాండల్ వుడ్ లో కొత్త రికార్డు. ఇక తమిళనాడు కేరళ సంగతి సరేసరి. ఈ ఫిగర్స్ కి మతులు పోవడం ఖాయం. మరి ఇంత పెద్ద స్కేల్ మీద సినిమాను తీసి అమ్ముతున్నప్పుడు పబ్లిసిటీ కూడా అదే స్థాయిలో చేస్తే తప్ప మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ రావు. వచ్చాక చూద్దాంలే అనుకునే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు.

రోబో విడుదలైన సమయంతో హైప్ ఆకాశాన్ని తాకింది. ఎలాగైనా మొదటి రోజే చూడాలన్న రేంజ్ లో దాని గురించి బాగా ప్రమోట్ చేసారు. కానీ 2.0 విషయంలో మాత్రం అది లేదనేది వాస్తవం. శంకర్ రజని కాంబో కాబట్టి ప్రచారం అక్కర్లేదు అనుకుంటే అది తప్పుడు అంచనా అవుతుంది. గత డిజాస్టర్ల నేపథ్యంలో రజని మార్కెట్ కొంత డౌన్ అయ్యింది. ఇది గ్రాఫిక్స్ మూవీ కాకపోయి వుంటే పరిస్థితి వేరుగా ఉండేది. మరో 11 రోజుల్లో విడుదల అవుతున్న ఇంత పెద్ద సినిమాకు లైకా ఎందుకు ఇలా చేస్తోంది అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పైగా వర్మ లాంటి నిర్మాతలు తమ సినిమాలను మరుసటి రోజే షెడ్యూల్ చేసుకోవడం చూస్తే 2.0కి అంత భయపడాల్సిన అవసరం లేదనే సంకేతాలు ఇస్తున్నారు. 2.0కు ఇంత వీక్ ప్రమోషన్ ని అభిమానులు సైతం ఊహించలేదు. ఎక్కడ చూసినా 2.0 చర్చ ఉండేలా వాతావరణాన్ని సృష్టించకపోవడం వెనుక లైకా స్ట్రాటజీ ఏంటనేది 29న తేలిపోతుంది