వర్మా.. జాలిపడ్డావా.. భయపడ్డావా

Fri Feb 22 2019 14:06:24 GMT+0530 (IST)

ఈ రోజు 'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ అయింది.  ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామంది ప్రేక్షకులకు ఉంది.  వీలైన వాళ్ళు థియేటర్ లోనూ.. వీలుకాని వాళ్ళు రివ్యూలు చదువుతూ సినిమా సంగతిని తెలుసుకుంటూ.. అర్థం చేసుకుంటూ ఉంటారు.  సినిమా సంగతి సరే.. ఇంటర్వెల్ ఎలా ఉంది?  అసలు సంగతి పక్కనబెట్టి సినిమా ఇంటర్వెల్ గురించి అడగడం ఏంటని కోపం తెచ్చుకోకండి.  ఇంటర్వెల్ అనగానే రేటెక్కువ పెట్టి 'కష్టంగా' తాగే కోకులు గట్రా టాపిక్ గురించి కాదు.  ఆర్జీవీ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ గురించి.   ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా?  ఇంటర్వెల్ లో మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ రాలేదు.   'ఎన్టీఆర్ మహానాయకుడు' టికెట్ కొనండి.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ను ఉచితంగా చూడండి .. ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ ఊదరగొట్టిన వర్మ ఇప్పుడు మాత్రం ట్రైలర్ చూపించకుండా ఉసూరుమనిపించాడు.
 
ఆయన 'ఎన్టీఆర్ మహానాయకుడు' టీమ్ పై జాలిపడ్డాడా లేదా భయపడ్డాడా? ఆ రేంజ్ హడావుడి చేసి ఎంతో స్పైసీగా ఉండాల్సిన 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఇంటర్వెల్ ను చప్పగా మార్చిన వర్మపై నెటిజనులు చిరాకు ప్రదర్శిస్తున్నారు.  "టెక్నలాజికల్లీ.. సోషల్లీ.. ప్రెజరల్లి.. బీకాం ఫిజిక్సల్లి.. కాట్రవల్లి కారణంగా ట్రైలర్ చూపించలేకపోయామని"  సాధారణ మానవులకు అర్థం కాని పదాలతో ఒక ట్వీట్ పడేసి చేతులు దులుపుకుంటాడేమో గురుడు.