రాయలవారి రాక ఉందా లేదా?

Tue Oct 23 2018 17:00:14 GMT+0530 (IST)

ఒక హీరో కొత్త సినిమా వస్తోంది అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి ఉంటుంది. అలాంటిది ముగ్గురేసి ఉన్నారు అంటే ఎలా ఉండాలి. అబ్బే అలాంటిది మాకేమి పట్టదు అన్నట్టు ఉంది వీర భోగ వసంత రాయలు వ్యవహారం. ఈ శుక్రవారమే విడుదల ఉన్నప్పటికీ ఏదో ఒకటి రెండు పోస్టర్లను అటు ఇటు తిప్పి హడావిడి చేయడం తప్ప ఇంకే అలికిడి లేదు. ఇవాళ యుఎస్ ప్రీమియర్స్ అన్నారు. అప్ డేట్ సకాలానికి అందడం లేదు. 26న ఇక్కడ రిలీజ్ అన్నారు.ఇప్పటిదాకా హైదరాబాద్ మాత్రమే కాదు ఏ సెంటర్ లోనూ ఆన్ లైన్ అడ్వాన్సు బుకింగ్ ప్రారంభం కాలేదు. సాధారణంగా ఈ మధ్య కాలంలో జంట నగరాల బుకింగ్స్ ముందు వారం శనివారం నుంచే అందుబాటులో ఉంచుతున్నారు. కాని వీరభోగవసంతరాయలు మాత్రం ఇంకా టికెట్ల అమ్మకం మొదలుపెట్టలేదు. బిజినెస్ విషయంగా ఏమన్నా తేడాలు వచ్చాయా లేక ఆఖరి నిముషం దాకా సెటిల్ మెంట్లు చేసి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా చూడాలి. డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు కాబట్టి మార్పు ఉండకపోవచ్చు కానీ ఇంత సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అన్నదే అందరికీ ఉన్న అనుమానం.  

నారా రోహిత్ సుదీర్ బాబుతో పాటు చాలా కీలకమైన పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్న ఈ మూవీలో శ్రేయ కూడా ఉంది. అయినా ప్రమోషన్ ఈవెంట్ కాని పబ్లిసిటీ కాని పెద్దగా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా అఫ్రికన్ అటవీ సంతతికి చెందిన గెటప్ లో శ్రీవిష్ణుని రివీల్ చేసిన లుక్ కాస్త తేడాగా ఉంది. ట్రైలర్ కూడా కొంత అయోమయానికి గురి చేసింది. మొత్తానికి ఇంత నిస్సారంగా ఇంత కన్ఫ్యూజన్ తో జనం ముందుకు వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఇదేనేమో అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తోడు ముగ్గురు హీరోల్లో ఎవరికి మొదటి రోజు క్రౌడ్ పుల్ చేసేంత కెపాసిటీ లేకపోవడం కూడా మైనస్ గా నిలుస్తోంది.

 అయినా సినిమా తీయడం ఒక ఎత్తు దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం అన్నింటి కన్నా పెద్ద ఎత్తుగా మారిన ట్రెండ్ లో ఈ వీరభోగవసంతరాయలు ఇంత చప్పుడు లేకుండా రావడం మాత్రం ఇప్పటికే ఉన్న అనుమానాలను బలపరుస్తోంది. కంటెంట్ ఉంటె ఏ సమస్యా లేదు. లేదంటేనే అసలు సమస్య వసూళ్ళ దగ్గరే మొదలవుతుంది