షాక్: లేడీ ఆర్టిస్టుల కు నో రూమ్

Wed Dec 19 2018 07:00:01 GMT+0530 (IST)

మీటూ ఎఫెక్ట్ టాలీవుడ్ పై ఎలా ఉంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అసలు టాలీవుడ్ పై దీని ప్రభావమేమీ లేదు అని భావిస్తున్నా చాప కింద నీరులా మీటూ ప్రభావం అల్లుకుని ఉందని తెలుస్తోంది. అసలు మేల్ ఆర్టిస్టులెవరూ లేడీ ఆర్టిస్టుల్ని దగ్గరకు రానియ్యడానికే జంకుతున్నారట. ఇదివరకటిలా సెట్స్ లో కలివిడిగా ఉండే వాతావరణం తగ్గింది. ఎవరికి వారు షాట్ కానిచ్చేసి వెళ్లిపోవడమే కానీ అసలు సరదాగా మాట్లాడటాలు లేవట. ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన మేల్ ఆర్టిస్టుల్లో ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఇకపోతే తమ కు ఎవరైనా లేడీ ఆర్టిస్టుల నుంచి ఫోన్ లు వచ్చినా.. అవకాశం ఇప్పించాల్సిందిగా సీనియర్ ఆర్టిస్టుల్ని కోరినా వెంటనే ఫోన్ పెట్టేస్తున్నారట. టాపిక్ మార్చేసి ఏదేదో మాట్లాడుతున్నారట.ఈ సన్నివేశం ఇలా ఉంటే మీటూ ప్రభావం వేరొక యాంగిల్ లోనూ లేడీ ఆర్టిస్టుల్ని పెద్ద దెబ్బ కొట్టిందని చెబుతున్నారు. అసలు లేడీ ఆర్టిస్టులకు హైదరాబాద్ లో బ్యాచిలర్ రూమ్స్ దొరకడమే చాలా కష్టం గా ఉందట. మణికొండ- కృష్ణానగర్- ఫిలింనగర్- ఇందిరా నగర్- ఎల్లారెడ్డి గూడలో ఇల్లు ఇచ్చేందుకు ఓనర్లు చాలానే భయపడుతున్నారట. ఎవరో చేసిన తప్పిదానికి అందరు ఆర్టిస్టులకు ఇదో పెద్ద తలనొప్పి గా మారిందని పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ ఆర్టిస్టు చెబుతున్నారు.

అద్దె కు ఇల్లు దొరక్క ఆర్టిస్టులు గజగజలాడుతున్నారట. అసలే బ్యాచిలర్స్ కి నగరాల్లో అద్దెకివ్వరు. ఇప్పడు మీటూ దెబ్బకు ససేమిరా అనేస్తున్నారు. లేడీ ఆర్టిస్టులనయితే దగ్గరకే రానివ్వడం లేదని సదరు సీనియర్ ఆర్టిస్టు చెప్పారు. మీ-టూ దెబ్బకు మరీ ఇంత దారుణంగా అయిపోయిందని చెబుతున్నారు. ఇకపోతే అమీర్ పేట్- ఎస్.ఆర్.నగర్ ఏరియాలు లేడీస్ హాస్టళ్ల కు ప్రసిద్ధి. అక్కడే ఆర్టిస్టులంతా తలదాచుకుంటున్నారట. దీంతో హాస్టళ్ల కు డిమాండ్ పెరిగి కిటకిటలాడుతున్నాయని తెలిసింది.  ఆర్టిస్లులంతా అమీర్ పేట్- ఎస్.ఆర్.నగర్ లో రకరకాల చోట్ల హాస్టళ్లలోనే ఉండడంతో వాటికి గిరాకీ అనూహ్యంగా పెరిగిందట. బయట ట్రై చేసినా ఎవరూ అద్దెకివ్వమంటున్నారు. దీంతో హాస్టళ్లను సంప్రదించాల్సి వస్తోందని చెబుతున్నారు. కొంతమంది వల్ల వచ్చిన ముప్పు.. అందరికీ పెనుముప్పు గా పరిణమించిందని చెబుతున్నారు. ఇక మీటూ ఉద్యమ ప్రభావం పై ఇదివరకూ మురళిమోహన్ అంతటి వారే.. సర్వ నాశనమైందని వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు.

మూవీ ఆర్టిస్టుల సంఘం సైతం లేడీ ఆర్టిస్టులు నోరెత్తితే ఇక దారుణ పరిణామం ఉంటుందని హెచ్చరించిందట. దీంతో ఎవరూ కిక్కురుమనని సన్నివేశం ఉంది. ఒక రకంగా శ్రీరెడ్డి అంశం సహా మాధవీలత- పలువురు ఆర్టిస్టులు మీడియా కెక్కడంతో అంతా జాగ్రత్త పడిపోయారు. ఇకపోతే అప్పట్లో వివాదాల్లోకి వచ్చిన ఒక్క ఆర్టిస్టుకు కూడా ఇంతవరకూ ఒక్క ఛాన్స్ ఇస్తే ఒట్టు! అని సదరు సీనియర్ ఆర్టిస్టు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంటే కోరి కష్టాల్ని కొని తెచ్చుకున్నారని .. ఫీమేల్ ఆర్టిస్టులు వారంతట వాళ్లు చేసుకున్నదేనని హెచ్చరిస్తున్నట్టే లెక్క.