నో హిట్ నవంబర్.. అంతే అంతే

Tue Nov 28 2017 10:32:40 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా నవంబర్ లో చిన్న సినిమాలు తెగ హంగామా చేశాయి. రిలీజ్ డేట్ కోసం గత కొంత కాలంగా ఎదురుచూసిన సినిమాలు కూడా పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఇదే కరెక్ట్ టైమ్ అని రిలీజ్ అయ్యాయి. దాదాపు నవంబర్ నెలంతా చూసుకుంటే 20 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో డబ్బింగ్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి మాత్రం అంతగా కనిపించలేదు. కొన్ని సినిమాలు అసలు రిలీజ్ అయిన రెండు రోజులకే మాయమైపోయాయి. #NoShaveNovember తరహాలో 'నో హిట్ నవంబర్' కు ఈ సినిమాలన్నీ కలసి కంకణం కట్టేశాయి.ఇక ఈ నెల మొదట్లో నవంబర్ 3న గరుడవేగ సినిమాతో సినిమాలు ఎక్కువగా సందడి చేయడం మొదలుపెట్టాయి. గరుడావేగ సినిమా నష్టాల భారిన పడకుండా పర్వాలేదు అనే విధంగా కలెక్షన్స్ ని రాబట్టింది. అదే రోజు రిలీజ్ అయిన నెక్స్ట్ నువ్వే - ఏంజెల్ సినిమాలు మాత్రం దారుణమైన డిజాస్టర్ ని అందుకున్నాయి. ఇక ఆ తర్వాత కేరాఫ్ సూర్యా - ఒక్కడు మిగిలాడు కూడా అదే తరహాలో దారుణమైన దెబ్బ తిన్నాయి.

అంచనాలు పెంచడానికి ట్రై చేసిన సినిమాలు కూడా ఆఖరికి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. లండన్ బాబులు అయితే ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు కానీ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో మొదటి షోకే రిజల్ట్ తెలిసిపోయింది. లవర్స్ క్లబ్ - స్నేహమేరా జీవితం  పరిస్థితి కూడా అదే. ఇక రీసెంట్ ఫ్రైడే లో దర్శనం ఇచ్చిన బాలకృష్ణుడు - దేవి శ్రీ ప్రసాద్ - జంధ్యాల రాసిన ప్రేమ కథ కూడా డివైడ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. కానీ వాటితో వచ్చిన మెంటల్ మదిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ లలో మాత్రం ఆసక్తికరంగా లేవంటున్నారు ట్రేడ్ జనాలు.

ఇక అదే టైమ్ లో రిలీజ్ అయిన కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. డిటెక్టివ్ - ఖాకి - జూలీ 2 - హే పిల్లగాడా వంటి సినిమాలు కొంచెం స్టార్స్ తో ఆకర్షించినా.. అన్ని సినిమాలు అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఫైనల్ గా నవంబర్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఏ మాత్రం నచ్చలేదనే చెప్పాలి. #NoHitNovember అని అనడంలో అతిశయోక్తి లేదేమో!!

ఇక రానున్న రోజుల్లో కూడా మరికొన్ని చిన్న సినిమాలు ఓ మీడియమ్ సైజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిలో ఏదైనా నవంబర్ బ్యాడ్ లక్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.