ఎక్స్ ట్రా షోలా.. వద్దు బాబోయ్!

Sun Jan 14 2018 13:04:18 GMT+0530 (IST)

పెద్ద సినిమాలకు ఉండే క్రేజును బట్టి తొలి వారంలో భారీగా థియేటర్లను కేటాయించడం.. టికెట్ల రేట్లు పెంచడం.. అదనపు షోలు వేయడం.. లాంటి అడ్వాంటేజీలుంటాయి. సినిమాకు టాక్ బాగుంటే ఈ అడ్వాంటేజీతో కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు. లేకుంటే కష్టం. ఇంతకుముందు మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’కు ఉదయం 8 గంటల నుంచే షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఆ అడ్వాంటేజీని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది ‘బ్రహ్మోత్సవం’. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రెగ్యులర్ షోలు నడవడమే కష్టమైంది. ఇక ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’కి కూడా ఇలాంటి సౌలభ్యమే కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే 24 గంటలూ షోలు వేసుకునే అవకాశమిచ్చింది. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 వరకు కూడా అదనపు షోలు వేసుకునే వీలు కల్పించింది. కానీ ఏం లాభం ఈ అడ్వాంటేజీ ఒక్క రోజు మాత్రమే ఉపయోగపడింది. సినిమాకు దారుణమైన టాక్ రావడంతో రెగ్యులర్ షోలకు జనాలు రావడమే కష్టమైంది. రెండో రోజు నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. ‘అజ్ఞాతవాసి’కి ఇచ్చిన బహుమతే ‘జై సింహా’కు కూడా ఇచ్చారు. దానికీ మంచి టాక్ రాలేదు. ఆ సినిమాకు కూడా రెగ్యులర్ షోలు ఫుల్లవడమే కష్టంగా ఉంది. అదనపు షోల గురించి ఆలోచించే పరిస్థితే లేదు. దీంతో ఈ షోలు వేసే ఆలోచన కూడా చేయట్లేదు ఎగ్జిబిటర్లు. ఈ ఎక్స్ ట్రా షోలకు అనుమతి లభించినపుడల్లా పరిస్థితి తలకిందులవుతుండటంతో ఇదొక సెంటిమెంటుగా మారిపోయి.. మున్ముందు ఇంకెవరూ వీటి కోసం అడిగే పరిస్థితే లేకుండా పోయేలా కనిపిస్తోంది. ‘బాహుబలి’ లాంటి సినిమాలకు తప్పితే మిగతా సినిమాలకు ఇలాంటి అడ్వాంటేజీలు పెద్దగా కలిసి రావేమో.