Begin typing your search above and press return to search.

నో సౌండ్ శుక్రవారం

By:  Tupaki Desk   |   13 Feb 2019 8:14 AM GMT
నో సౌండ్ శుక్రవారం
X
సౌత్ లో అందులోనూ తెలుగు తమిళ రాష్ట్రాల్లో ఉన్నంత సినిమా ప్రియులు వేరెక్కడ లేరన్నది వాస్తవం. అందుకే ప్రతి శుక్రవారం కొత్త సినిమాల సందడితో బాక్స్ ఆఫీస్ కళకళలాడుతు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటూ ఉంటారు. అయితే వారి మొక్కులు ఈ మధ్య అంతగా ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు. ఓ వారం ఒక హిట్ వస్తే ఇంకో సక్సెస్ చూడాలంటె నెల దాకా వేచి చూసే పరిస్థితి వచ్చేసింది. వీకెండ్స్ లో ఏదోలా నెట్టుకొస్తున్నా మిగిలిన రోజులు ఎగ్జిబిటర్లకు దినదినగండంగా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజున వస్తున్న రెండు డబ్బింగ్ సినిమాల మీద కనీస బజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. అందులోనూ కార్తీ లాంటి పేరున్న హీరో నటించిన దేవ్ కొంచెం కూడా చప్పుడు చేయడం లేదు. చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అంతకు ముందు ట్రైలర్ వదిలి దుమ్ము దులుపుకున్నారు తప్ప అంతకు మించి హైప్ తెచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తే ఒట్టు.

కార్తీకి ఇప్పుడు మునుపటి మార్కెట్ లేదు. వరుస పరాజయాలు బాగా దెబ్బ తీశాయి. కాష్మోరా నుంచి చినబాబు అన్ని ఒకేరీతిలో ఫలితాలు అందుకున్నాయి. అందుకే దేవ్ కు సంబంధించి ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. దానికి తగ్గట్టే బుకింగ్ కూడా చాలా స్లోగా నీరసంగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ రమ్యకృష్ణ నాజర్ ఇలా అందరూ తెలిసిన ఆర్టిస్టులే ఉన్నప్పటికీ ఎందుకో మనవాళ్లకు దేవ్ థీమ్ కనెక్ట్ కాలేకపోతోంది. టాక్ బ్రహ్మాండంగా వస్తేనే నిలదొక్కుకుంటుంది తప్ప ఇంత నీరసంగా ఓపెన్ అయిన సినిమా గట్టెక్కడం అంత ఈజీ కాదు.

ఇక లవర్స్ డే పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. కన్నుగీటు సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో మీదే ప్రచారం చేస్తూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమలో పడ్డ యూత్ జంటలు కాసేపు టైం పాస్ చేయడానికి రావడం తప్పించి ఈ థియేటర్ల వైపు సామాన్య ప్రేక్షకులు కన్ను వేయడం కష్టమే.రేపు తెలుగు స్ట్రెయిట్ మూవీ ఏదీ రేపు లేకపోవడం అసలైన లోపం. ఏదో ఒకటి చూడాలని సర్దుకోవడం తప్ప ఖచ్చితంగా చూసి తీరాలి అనిపించే సినిమా ఏది లేకపోవడంతో ఈ శుక్రవారం డ్రైగానే మొదలుకానుంది