Begin typing your search above and press return to search.

పుల్వామా ఎఫెక్ట్.. బాలీవుడ్ కు వార్నింగ్

By:  Tupaki Desk   |   18 Feb 2019 9:43 AM GMT
పుల్వామా ఎఫెక్ట్.. బాలీవుడ్ కు వార్నింగ్
X
ఇటీవల జమ్మూలోని పుల్వామా జిల్లాలో సీఆర్‌ పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిపై దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ సంఘటనకు పాకిస్థాన్‌ దేశమే కారణమంటూ ఇండియాకు చెందిన కొన్ని వ్యాపార - వాణిజ్య సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ తో ఉన్న వ్యాపార సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచేసుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌ తో 'మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌' హోదాను భారత్ ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతి చేసే వస్తువులపై 200 కస్టమ్స్‌ డ్యూటీని విధించిన విషయం తెలిసిందే.

ఈ నిరసన సెగ తాజాగా బాలీవుడ్‌ కు కూడా తగిలింది. పాకిస్థాన్‌ కు చెందిన సినిమా - టీవీ నటులు - సింగర్లకు బాలీవుడ్‌ లో అవకాశం ఇవ్వరాదని ఇండియన్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఇకపై సినిమాల్లో వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిస్తే సెట్‌ కు వచ్చి తగలబెడుమని హెచ్చరించింది. జవాన్ల వీరమరణంతో దేశం మొత్తం దిగ్బ్రాంతికి లోనైందని, ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేన్ డైరెక్టర్‌ అశోక్‌ పండిట్‌ పేర్కొన్నారు.

అలాగే ప్రముఖ సంగీత కంపెనీ టీ సీరిస్‌కు కూడా ఇండియన్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ హెచ్చరికలు వచ్చాయి. ఈ సంస్థలో ఎక్కువ మంది సింగర్స్‌ పాకిస్థాన్‌ కు చెందిన వారే ఉన్నారు. దీంతో వారికి ఉద్వాసన పలకాలని స్పష్టం చేసింది. మిగతా మ్యూజిక్‌ కంపెనీలు కూడా పాక్‌ సింగర్స్‌తో పాటలు పాడించరాదని తెలిపింది. అయితే జవాన్లపై దాడి తర్వాత పాక్‌ సింగర్స్‌తో మ్యూజిక్‌ చేయడం టీ సీరిస్‌ ఆపేసింది.

మరోవైపు మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ సభ్యులు రంగంలోకి దిగి పాకిస్థాన్‌ నటులకు అవకాశం ఇవ్వొద్దంటూ ముంబైలో తాజాగా నిరసన తెలుపుతున్నారు. గతంలో ఓ సారి జవాన్ల మృతి సంఘటనలో పాక్‌ నటులపై నిషేధం వేయాలని వీరు ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు ముంబైలో ఉద్యమం ఇంకా తారాస్థాయికి చేరుతోంది. .