ఇద్దరు కొత్తమ్మాయిలు 'హలో' చెబుతారట

Wed Sep 13 2017 12:21:39 GMT+0530 (IST)

అఖిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అక్కినేని అఖిల్ మొదటి సినిమా వచ్చి రెండేళ్ళు అవుతున్న ఇంకా తన రెండవ సినిమాను రిలీజ్ చేయలేదు. ఎలాగైనా రెండవ సినిమాతో బాక్స్ ఆఫీస్ కి గట్టిగా హలో చెప్పాలని "హలో" సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. "మనం" సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైన విక్రమ్  కుమార్ హలో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూనే క్యారెక్టర్స్ ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన కొత్తమ్మాయి కళ్యాణి ప్రియదర్శిన్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక చిత్ర యూనిట్ ఈ లవ్ స్టోరీలో మరో కొత్త కథానాయిక కోసం ఆడిషన్ నిర్వహించిందట. విశ్వాసనియ సమాచారం ప్రకారం ఇందులో మరొ కొత్త భామ నివేదిత సతీష్ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఇప్పటికే ఈ అమ్మడు తమిళ్ లో ఓ సినిమాలో నటించింది. జ్యోతిక లీడ్ రోల్ లో నటిస్తున్న మగలిర్ మట్టుమ్ అనే సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆ సినిమా ఈ నెల 15న రిలీజ్ కాబోతోంది.

మొదటి సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే నివేదిత అఖిల్ రెండవ సినిమా లో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి నిర్మాత నాగార్జున రెడీ అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనుబ్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.