Begin typing your search above and press return to search.

భీష్మగా వస్తున్న నితిన్

By:  Tupaki Desk   |   20 Jun 2018 11:27 AM GMT
భీష్మగా వస్తున్న నితిన్
X
లవర్ బాయ్ గా రిస్క్ ఫ్రీ మూవీస్ తో కెరీర్ ని సాఫీగా నడిపిస్తున్న హీరో నితిన్ కొత్త సినిమా శ్రీనివాస కళ్యాణం దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉంది. షూటింగ్ ముందు అనుకున్న ప్రకారం అయితే పూర్తయ్యి ఉండాలి. కానీ బయటికి చెప్పని కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతోంది. ఆగష్టు 9న విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. దీని తర్వాత నితిన్ ఏ సినిమా చేస్తాడా అనే ఆసక్తి కలగడం సహజం. ఛలో లాంటి సర్ప్రైజ్ హిట్ తో అందరిని ఆశ్చర్యపరిచిన దర్శకుడు వెంకీ కుడుముల తీయబోతున్న మూవీలో నితిన్ హీరోగా ఓకే అయిన సంగతి తెలిసిందే.

దీనికి భీష్మ అంటే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ట్యాగ్ లైన్ సింగిల్ ఫర్ ఎవర్. పేరును బట్టే ఇది పెళ్లి చేసుకోవడం సుతరామూ ఇష్టం లేని ఒక యువకుడి కథగా అర్థమవుతోంది. కాప్షన్ కూడా అదే పెట్టడంతో ఇక డౌట్ ఏమి లేదు. మరి పెళ్లంటే పడని హీరోని హీరోయిన్ ఎలా పడగొడుతుంది అనే పాయింట్ మీద వెంకీ కుడుములు మంచి ఎంటర్ టైన్మెంట్ జోడించి రాసుకున్నట్టు తెలిసింది. నితిన్ శ్రీనివాస కళ్యాణం పూర్తయ్యే లోపే దీని షూటింగ్ మొదలుకానుంది . సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ ప్రపోజల్ మూడు నెలల నుంచి చర్చల్లో ఉండగా ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఆజన్మ బ్రహ్మచారిగా మహాభారత కావ్యంలో మిగిలిపోయిన భీష్ముడి పేరుని దీనికి పెట్టడం ఆసక్తిని రేపేదే.

సితార బ్యానర్ ప్రస్తుతం నాగ చైతన్యతో శైలజారెడ్డి అల్లుడు తో పాటు నానితో జెర్సీ సినిమాలు నిర్మిస్తోంది. ఇది త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ హారికా అండ్ హాసినికి సిస్టర్ టై అప్ లాంటిది. కాకపోతే దీన్ని చినబాబు ఒక్కరే నడుపుతారు. నితిన్ హారికా సంస్థతో ఇటీవలే చల్ మోహనరంగా చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ తోనే తన ఉద్దేశాన్ని చెబుతున్న వెంకీ కుడుములు తన కామెడీ టైమింగ్ తో నితిన్ ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఛలో తరహాలోనే కామెడీతోనే ఎమోషన్స్ మిస్ కాకుండా భీష్మను రాసుకున్నట్టు టాక్.