వీటిని ప్లాప్ అనగలమా

Wed Jun 13 2018 12:06:48 GMT+0530 (IST)

సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యాయా లేదా అని చెప్పడానికి కలెక్షన్స్ కొలమానమైతే యు ట్యూబ్ లో ఏదైనా వీడియో కానీ సినిమా కానీ హిట్ అయ్యిందా లేదా అనేదానికి వ్యూస్ ప్లస్ లైక్స్ కొలతగా తీసుకుంటాం. ఆ కోణంలో  తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాలు ఆన్ లైన్ లో  సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హీరో ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా సౌత్ సినిమాలకు నార్త్ జనం పట్టం కడుతున్నారు. నితిన్ హీరోగా గత ఏడాది వచ్చిన లై ఇక్కడ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. కానీ ఇదే సినిమాను 40 నిముషాలు కత్తిరించి రెండు గంటల హిందీ  వెర్షన్  యు ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే కేవలం 6 నెలల్లో 51 మిలియన్ల వ్యూస్ అంటే అక్షరాలా 5 కోట్లకు పైగా విజిటర్స్ ను తెచ్చుకుని ఆన్ లైన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఏదో యాక్షన్ సినిమా కాబట్టి అలా గాలివాటం హిట్ అనుకుంటున్నారేమో. ఇంత కన్నా తేడాగా బోల్తా కొట్టిన నితిన్ చిన్నదానా నీ కోసం సైతం 25 మిలియన్ల వ్యూస్ దాటేసి రేస్ లో పరుగెడుతోంది. ఓవర్ సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన అదే నితిన్ అఆ హిందీ డబ్బింగ్ వెర్షన్ యు ట్యూబ్ లో ఇప్పటి దాకా తెచ్చుకున్న వ్యూస్ కేవలం 7 మిలియన్ల లోపే అంటే షాక్ కలగక మానదు.ఈ ట్రెండ్ కొత్తది కాకపోయినా ఇప్పుడు ఇంకా ఊపందుకుంటోంది. నితిన్-గోపిచంద్-రామ్ లాంటి హీరోల సినిమాలు ఇక్కడ ఫలితం ఏమైనా యు ట్యూబ్ లో మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నాయి. వీటిలో అల్లు అర్జున్ అందరి కంటే ముందు వరసలో ఉన్నాడు. సరైనోడు  ఇప్పటికే 180 మిలియన్ల దాటేసి 200 మార్క్ వైపు పరుగులు తీస్తూ భవిష్యత్తులో బహుశా ఎవరికి సాధ్యం కానీ రికార్డును అందుకోవడానికి ఉరకలు వేస్తోంది. డీజే సైతం 160 క్రాస్ చేసి నేనా నువ్వా అనే రేంజ్ లో పోటీ పడుతోంది . ఇండియన్ సినిమాలో చరిత్రగా మిగిలిపోయిన క్లాసిక్ మూవీస్ కి కూడా రాని వ్యూస్ వీటికి రావడం విశేషం. నార్త్ లో మన సినిమాలంటే ఎంత పడిచస్తారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వీటి పుణ్యమా అనే సోనీ మ్యాక్స్ లాంటి ఛానల్స్ మనుగడను సాగిస్తున్నాయి. మసాలా ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడంలో మనవాళ్ళను మించిన వారు ఎవరు లేరని అర్థమైందిగా. అందుకే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తెలుగు సినిమాలకు డబ్బింగ్ హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవుట్ కాకపోయినా ఈ రకంగా అయినా మన సినిమాలు కాసులు కురిపించడం హర్షణీయమే.