విడుదల వాయిదా పడటం మంచిదేనట..

Thu Apr 25 2019 20:00:01 GMT+0530 (IST)

సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ అవ్వకపోవడం వల్ల నష్టాలే ఎక్కువని - అదో అశుభమని ఇండస్ట్రీలో నమ్ముతూ ఉంటారు. ఇది నమ్మకమే కాదు నిజం కూడా - ఎందుకంటే సినిమాని రిలీజ్ చేయాలంటే థియేటర్స్ దగ్గర నుంచి - పబ్లిసిటీ - రిలీజ్ తరువాత శాటిలైట్ ఎగ్రిమెంట్స్ ఇలా చాలా పంచాయితీలు ఉంటాయి. వాటిని అన్ని సక్రమంగా సరి చేసుకుంటూ ఓ సినిమాని రిలీజ్ చేయాలి - అన్నిటికంటే ప్రేక్షకుల దృష్టిని ఆ రిలీజ్ డేట్ పై పడేలా చేయడం కత్తి మీద సామే. దీనికి తోడు పలుమార్లు రిలీజ్ డేట్ మారిన సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయని ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్స్ తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాడు హీరో నిఖిల్ - మనోడు సినిమాలు వాయిదా పడితేనే బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. నిఖిల్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కార్తీకేయ అనేకసార్లు వాయిదా పడి చివరకు రిలీజై ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. ఆ తరువాత నిఖిల్ ని స్టార్ హీరోని చేసిన ఎక్కడకి పోతావు చిన్నవాడా విషయంలో కూడా రిలీజ్ డేట్ అనేకసార్లు మారింది. కట్ చేస్తే ఈ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు నిఖిల్ లేటెస్ట్ మూవీ - అర్జున్ సురవరంలో కూడా విడుదల తేదీ వాయిదా పడుతూనే ఉంది. ముందు ఫిబ్రవరి రిలీజ్ అని - ఆ తరువాత మార్చి అని ఇప్పుడు మే అని అనేకసార్లు ఈ సినిమా రిలీజ్ ని మారుస్తూ వచ్చారు. ఇప్పుడు మే 1 విడుదల కావాల్సిన ఈ సినిమాను రెండు వారాలు వెనక్కి జరిపి మే 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎవెంజర్స్ మేనియా బాక్సాఫీస్ పై అసాధరణ రీతిలో ఉండటం - దానికీ తోడు ఎవెంజర్స్ హంగామా ముగిసిన వెంటనే మహర్షి రూపంలో మరో పెద్ద సినిమా రిలీజ్ ఉండటంతో - ఈ రెండు సినిమాలు హడావడి తగ్గాకే అర్జున్ సురవరంను ప్రేక్షకుల ముందుకి తీసుకురావలని నిఖిల్ అండ్ టీమ్ నిర్ణయం తీసుకున్నట్లుగా వినిపిస్తుంది. డిస్ట్రీబ్యూటర్స్ సలహా సూచనలు అనుసరించే అర్జున్ సురవరం విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా నిఖిల్ చెబుతున్నాడు.