ముద్ర బలంగా ఉండాలి నిఖిల్

Sat Aug 11 2018 12:11:07 GMT+0530 (IST)

హడావుడి పడకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన టేస్ట్ ను బట్టే  కథలను ఎంచుకుంటున్న నిఖిల్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. హ్యాపీ డేస్ రేంజ్ లో ఆడుతుందని ఆశలు పెట్టుకున్న కిరాక్ పార్టీ నిరాశ పరచడం నిఖిల్ నే కాదు అభిమానులను సైతం హర్ట్ చేసింది. అందుకే కొత్త సినిమా విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్ మరోసారి రీమేక్ నే తీసుకున్నప్పటికీ థ్రిలర్ జానర్ లోకి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. టాగోర్ మధు నిర్మాతగా తమిళ సూపర్ హిట్ మూవీ కనితన్ ఆధారంగా రూపొందుతున్న ముద్ర షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజి కి వచ్చేసింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ తీసిన టీఎన్ సంతోష్ తెలుగుకు కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విడుదల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోని యూనిట్ దసరా లేదా దీపావళి సీజన్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం.నిజానికి నిఖిల్ ఎప్పుడు రొటీన్ కథలకు కట్టుబడలేదు. థ్రిల్లర్స్ గా చేసిన స్వామి రా రా కార్తికేయ మంచి పేరుగా తీసుకురాగా హారర్ టచ్ ఉన్న ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు ఆనంద్ కు భారీ ఆఫర్ వచ్చేలా చేసింది. కాకపోతే కామెడీగా ట్రై చేయాలని చూసిన శంకరాభరణం ఒక్కటే ఫలితం తేడాగా ఇచ్చింది. అది మొహమాటానికి ఒప్పుకున్నా అని నిఖిల్ తర్వాత చెప్పాడు అది వేరే సంగతి. నిఖిల్ ముద్ర మీద ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఒకవైపు నిన్నా మొన్న వచ్చిన యూత్ హీరోలు వరస సక్సెస్ లతో దూసుకుపోతుండగా నిఖిల్ కాస్త స్లో గా ఉండటం చూసి వేగం పెంచమని కోరుతున్నారు అభిమానులు. అంతే మరి. ఎంత కథలకు ప్రాధాన్యం ఇచ్చినా వరస సినిమాలతో రెగ్యులర్ టచ్ లో ఉంటేనే ఒకటి కాకపోయినా మరొక సక్సెస్ తో ట్రాక్ లో ఉండొచ్చు. ముద్ర కోసం బాడీ పరంగా కూడా నిఖిల్ చాలా మేకోవర్ చేసుకున్నాడు. కండలు తిరిగిన దేహాన్ని సోషల్ మీడియా పిక్స్ లో లీలగా చూపిస్తున్న నిఖిల్ దీని తర్వాత మరో క్రేజీ దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అతనెవరు ఆ వివరాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.