కిరాక్ పార్టీ.. ఇదైనా ఫైనలేనా?

Wed Feb 21 2018 18:39:32 GMT+0530 (IST)

ఫిబ్రవరి రెండో వారాంతంలో మూడు సినిమాలు రిలీజయ్యాయి. వాటితో పాటే అదే వీకెండ్ లో నిఖిల్ సినిమా ‘కిరాక్ పార్టీ’ కూడా రావాల్సింది. కానీ ఆ సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం..ఇంకొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. ఫిబ్రవరి 23 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ ఫిబ్రవరి ద్వితీయార్ధం నుంచి అన్ సీజన్ మొదలవుతుంది. స్టూడెంట్స్ పరీక్షల్లో మునిగిపోవడం వల్ల సినిమాల వైపు చూడరు. ఇది కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ కావడంతో స్టూడెంట్ ఆడియన్సే కీలకం. కాబట్టి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయడం మంచిది కాదని నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.ఇంకో నెల రోజుల పాటు ‘కిరాక్ పార్టీ’ని విడుదల చేస్తే కష్టమని భావించి.. చివరికి మార్చి 22వ తేదీని ఫిక్స్ చేసుకుంది చిత్ర బృందం. నిన్ననే ఆ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఒక్క రోజు గడిచేసరికి మళ్లీ ఆలోచన మారిపోయింది. మార్చి చివరి వారంలో ‘రంగస్థలం’తో పాటు ‘మహానటి’ కూడా విడుదలయ్యేలా ఉండటంతో వారం రోజుల రన్ సరిపోదనుకున్నారో ఏమో.. ఇప్పుడు మార్చి 16కు సినిమాను ప్రిపోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి మధ్యలో పరీక్షల హడావుడి ఉన్నప్పటికీ 18న ఉగాది సెలవు కలిసొస్తుందని.. ‘రంగస్థలం’ రావడానికి ముందు రెండువారాల గ్యాప్ కూడా కలిసి వస్తుందని రిలీజ్ డేట్ ఇలా ఫిక్స్ చేసినట్లున్నారు.

మరి ఈ తేదీకైనా కట్టుబడి ఉంటారా.. మళ్లీ మార్పులుంటాయా అన్నది చూడాలి. కన్నడ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. నిఖిల్ మిత్రులు సుధీర్ వర్మ.. చందూ మొండేటి ఈ చిత్రానికి రచనా సహకారం అందించడం విశేషం.