Begin typing your search above and press return to search.

పండగ తరవాత.. సమ్మర్ ముందు..

By:  Tupaki Desk   |   9 Dec 2017 4:53 PM GMT
పండగ తరవాత.. సమ్మర్ ముందు..
X
ఈమధ్య వరసగా కొత్త కొత్త జోనర్లలో సినిమాలు చేసుకుంటూ వస్తున్న యంగ్ హీరో నిఖిల్ చాలా రోజుల తర్వాత రొమాంటిక్ ఎంటర్ టెయినర్ సినిమా చేస్తున్నాడు. కన్నడ మూవీ కిరాక్ పార్టీ తెలుగు రీమేక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగు వెర్షన్ కు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ ఏడాది సంక్రాంతి పండగకు... సమ్మర్ ముందు పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కానున్నాయి. సేఫ్ జోన్ గా ఉండేలా నిఖిల్ ఈ రెండింటికి మధ్యలో తన సినిమా ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 9న ఈ కిరాక్ పార్టీ రిలీజ్ చేయనున్నారు. అప్పటికి థియేటర్లలో సంక్రాంతి సినిమాల హడావుడి తగ్గుముఖం పడుతుంది కాబట్టి థియేటర్లు కూడా అందుబాటులో ఉంటాయనేది ఫిలిం మేకర్ల ఆలోచనగా ఉంది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న కిరాక్ పార్టీ సినిమాతో సంయుక్త హెగ్డే.. సిమ్రన్ పరింజా హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

ఇంతకుముందు నిఖిల్ హీరోగా సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్లు చందు మొండేటి.. సుధీర్ వర్మ కూడా కిరాక్ పార్టీ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రేమమ్ ఫేం చందు మొండేటి స్క్రీన్ ప్లే బాధ్యతలు చూస్తుండగా.. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైలాగులు అందిస్తున్నారు. రిలీజ్ డేట్ లాక్ చేయడంతో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టే పనిలో చిత్ర యూనిట్ ఉంది.