Begin typing your search above and press return to search.

అరంగేట్ర హీరో సినిమాకు 75 కోట్లా?

By:  Tupaki Desk   |   28 July 2016 10:30 PM GMT
అరంగేట్ర హీరో సినిమాకు 75 కోట్లా?
X
తెలుగులో అఖిల్ అరంగేట్ర సినిమా ‘అఖిల్’కు రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయాం. అఖిల్‌ కు పెద్ద ఫిలిం బ్యాగ్రౌండ్ ఉంది. పైగా అతడికి తొలి సినిమా చేయడానికి ముందే మంచి క్రేజ్ వచ్చింది. పైగా తెలుగు సినిమా మార్కెట్ పెద్దది. కానీ కన్నడ నాట ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేయడానికి ఏకంగా రూ.75 కోట్లు పెట్టేస్తుండటం సంచలనం రేపుతోంది.

మాజీ ప్రధాని దేవెగౌడకు మనవడు.. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి తనయుడు అయిన నిఖిల్ గౌడ ‘జాగ్వార్’ అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకుముందు ‘మిత్రుడు’ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమైన మహదేవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘జాగ్వార్’ బడ్జెట్ రూ.75 కోట్లని సీనియర్ పీఆర్వో బీఏ రాజే స్వయంగా వెల్లడించారు.

ఈ నెల 31న ‘జాగ్వార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ నేపథ్యంలో కన్నడ నాట హంగామా మామూలుగా లేదు. పోస్టర్ రిలీజ్ కోసం ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆడియో వేడుకను కూడా ఓ రేంజిలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. ‘జాగ్వార్’ తెలుగు వెర్షన్ కోసం మన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంతో స్పెషల్ కామెడీ ట్రాక్ కూడా చేయించడం విశేషం.