Begin typing your search above and press return to search.

నాగ్ వర్మను ఇలా వదిలేశాడేంటి?

By:  Tupaki Desk   |   13 Jan 2018 7:15 AM GMT
నాగ్ వర్మను ఇలా వదిలేశాడేంటి?
X
కొన్ని నెలల కిందట రామ్ గోపాల్ వర్మతో తాను సినిమా చేసే అవకాశాల గురించి నాగార్జున మాట్లాడుతూ.. వర్మ కథ చాలా బాగా చెప్పాడని.. ఐతే గత కొన్నేళ్లుగా తలా తోకా లేని సినిమాలు చేస్తూ.. ఒకేసారి ఎక్కువ సినిమాలు నెత్తికెత్తుకోవడం వల్ల అతను దారి తప్పాడని.. తనతో సినిమా చేస్తున్నపుడు ఇలా వేరే కమిట్మెంట్లేవీ పెట్టుకోకుంటేనే.. పూర్తిగా తన సినిమా మీదే ఫోకస్ పెడితేనే తాను సినిమా చేస్తానని కండిషన్ పెట్టానని నాగ్ వెల్లడించాడు. నాగ్ చెప్పినట్లే కొంత కాలం వర్మ కూడా సిన్సియర్ గా కనిపించాడు. తాను అప్పటికే అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల ఊసెత్తకుండా సైలెంటుగా ఉన్నాడు. నాగ్ కూడా వర్మ తీరు నచ్చి అతడితో సినిమా మొదలుపెట్టాడు.

అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటుండగా ఇప్పుడు వర్మ మళ్లీ పాత స్టయిల్లోకి మారిపోయాడు. కొన్ని రోజుల కిందటే ‘కడప’ పేరుతో ఒక వివాదాస్పద వెబ్ సిరీస్ ప్రకటించాడు. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో ఒక పోర్న్ స్టార్ తో షార్ట్ ఫిలిం తీయడానికి తయారయ్యాడు. ఇది ఇప్పుడు నాగార్జున అభిమానుల్ని కలవర పరుస్తోంది. ఆ వెబ్ సిరీస్.. ఈ షార్ట్ ఫిలిం బూతులతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ సగటు తెలుగు ప్రేక్షకులకు రుచించడం లేదు. ఒకవైపు నాగార్జునతో సినిమా చేస్తూ ఇదేంటని వాళ్లు విమర్శిస్తున్నారు. నాగార్జునకు కుటుంబ ప్రేక్షకుల్లో.. మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరి నాగ్ తో సినిమా చేస్తున్న దర్శకుడు ఇలా పోర్న్ స్టార్ తో కలిసి నగ్న వీడియోలంటూ హడావుడి చేస్తూ ఆ రకమైన ఫొటోలు షేర్ చేస్తుండటం వారికి ఎలా రుచిస్తుంది..? ఇది నాగార్జున సినిమా మీద ప్రభావం చూపుతుందేమో అన్న ఆందోళన అభిమానుల్లో కలుగుతోంది. మరి వర్మను మధ్యలో నాగ్ ఇలా ఎలా వదిలేశాడన్నది అర్థం కావడం లేదు.