ప్రధాని కొడుక్కే ఫేస్ బుక్ షాకిచ్చింది

Wed Dec 19 2018 07:00:01 GMT+0530 (IST)

ఇటీవలి కాలంలో వరుస షాకులు ఎదుర్కుంటున్న ఫేస్ బుక్ సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత పడుతోంది. తాజాగా ఓ దేశ ప్రధానిమంత్రి కుమారుడికే షాకిచ్చింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పెద్దకుమారుడైన యైర్ నెతన్యాహూ పెట్టిన ముస్లిం వ్యతిరేక పోస్టులు ఫేస్ బుక్ తొలగించింది. ఇజ్రాయిల్ నుంచి మొత్తం ముస్లింలంతా వెళ్లిపోవాలని అతడు పోస్టు పెట్టాడు. ``ఇజ్రాయిల్ లో శాంతి కావాలంటే యూదులైనా వెళ్లిపోవాలి లేదా ముస్లింలైనా వెళ్లిపోవాలి.. ముస్లింలు వెళ్లిపోతే బాగుంటుందని నా అభిప్రాయం`` అని అందులో రాశాడు.ప్రధానమంత్రి తనయుడు పెట్టిన ఈ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీంతో 24 గంటల పాటు యైర్ పేజీని ఫేస్ బుక్ నిలిపివేసింది. ఆతర్వాత పోస్టును తొలగించింది. దీనిపై యైర్ మండిపడ్డాడు. ఇది ఆలోచనలపై నిరంకుశత్వం తప్ప మరేమీ కాదని విమర్శించాడు. ఫేస్ బుక్ ను తిట్టడానికి అతడు ట్విటర్ కు మళ్లడం గమనార్హం. భూమిమీద దాడులంటూ జరుగని దేశం ఏదైనా ఉందా? బహుశ ఐస్ ల్యాండ్ లేదా జపాన్ లో జరుగవేమో.. ఎందుకంటే అక్కడ ముస్లింలు అసలు లేరంటూ మళ్లీ అదేరకం పాట అందుకున్నాడు. ఈ వ్యవహారంపై ప్రధాని ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. ప్రధాని ఇంట్లో ఉంటూ యైర్ ఓ బాడీగార్డు - డ్రైవరు - ఇతర సౌకర్యాలు అనుభవిస్తున్నాడని వారంటున్నారు. వారసత్వ రాజకీయాలు నెలకొల్పేందుకు యైర్ తల్లిదండ్రులు అతడిని భావినేతగా తీర్చిదిద్దుతున్నట్టు ఉన్నదని వారు పేర్కొంటున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఇజ్రాయిలీ యూదుల్లో తీవ్ర జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుంది. ఈ క్రమంలోనే తాజా పోస్ట్ అని భావిస్తున్నారు.