తొలి రోజు దేని సత్తా ఎంత?

Sat Aug 12 2017 16:17:52 GMT+0530 (IST)

ఒకే రోజు మూడు క్రేజున్న సినిమాలు రావడంతో తెలుగు సినీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. మూవీ మారథాన్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఈ మూడు సినిమాల గురించే మాట్లాడుతున్నారు. ఈ మూడింట్లో ఏదీ నెగెటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషమే. ఇక ఓపెనింగ్స్ విషయానికొస్తే.. దేని స్థాయిలో అది బాగానే వసూలు చేసింది. ఐతే తెలుగు రాష్ట్రాల వరకు వస్తే మాస్ అప్పీల్ ఎక్కువున్న సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.భారీగా ప్రచారం చేయడం.. పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడం వల్ల తొలి రోజు టాక్ తో సంబంధం లేకుండా దగ్గుబాటి రానా సినిమా ‘నేనే రోజు నేనే మంత్రి’ మంచి వసూళ్లే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు 3.72 కోట్లు వసూలు చేసింది. నైజాంలో 1.22 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్ కలెక్షన్ల లెక్క తేలాల్సి ఉంది. అక్కడ కూడా మంచి వసూళ్లే వచ్చినట్లు చెబుతున్నారు. సోలో హీరోగా రానా కెరీర్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు ఇవే.

ఇక బోయపాటి మాస్ మసాలా సినిమా ‘జయ జానకి నాయక’ కూడా ‘నేనే రాజు..’కు దీటుగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం 3.27 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో థియేటర్లు ఇవ్వకపోయినా.. మాస్ ఏరియాల్లో మంచి వసూళ్లు రాబట్టి ఓవరాల్ కలెక్షన్లలో హవా చాటుకుంది. నైజాంలో ఈ చిత్రానికి రూ.90 లక్షల ఫస్ట్ డే షేర్ వచ్చింది. మిగతా రెంటితో పోలిస్తే ‘లై’ వసూళ్లు తక్కువే. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 2.28 కోట్ల షేర్ వచ్చింది. ఇది అర్బన్ యూత్ కు కనెక్టయ్యే సినిమా కావడం.. బి-సి సెంటర్లలో రెస్పాన్స్ బాలేకపోవడం ప్రతికూలమైంది. ఐతే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా నెంబర్ వన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.