ట్రైలర్ టాక్: మాస్ కోసం నేల టిక్కెట్

Wed May 16 2018 21:22:26 GMT+0530 (IST)

ఇప్పుడున్న హీరోల్లో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. కొందరు అయితే కేవలం క్లాస్ సినిమాలు చేస్తారు. కొందరు కేవలం మాస్ అంటారు. అలాంటి మాస్ హీరోల్లో అగ్రజుడు మన మాస్ రాజా రవితేజ. నిజానికి ఇప్పుడు హీరోలందరూ మసాలా కలిపేసి రకరకాల జానర్లలో సినిమా చేస్తుంటే.. రవితేజ మాత్రం చక్కగా మాస్ కు కావల్సిన అంశాలతో పుష్కలమైన సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ''నేల టిక్కెట్'' అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. పదండి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.పంచ్ డైలాగులూ.. జోకులూ.. మాస్ ఫైట్లు.. మాస్ పాటలు.. కత్తిలాంటి ఒక హీరోయిన్.. వీటన్నింటినీ వీరందరినీ కలిపి ''చుట్టూ జనం మధ్యలో మనం'' అంటూ నడిపించే ఒక హీరో. చుట్టూ చాలామంది ఉన్నా కూడా సాయం చేసేవాడు ఎవ్వరూ లేరు అంటూ మరో పాయింట్ ను దీనికి జతచేసి.. ''నేల టిక్కెట్'' కథనాన్ని కాస్త ఆసక్తికరంగానే నడిపించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. మాస్ రాజా కూడా తనకు అచ్చొచ్చిన జానర్ లో క్యారక్టర్ లో పరకాయ ప్రవేశం చేసేశాడంతే. ఇక కొత్తమ్మాయ్ మాళవిక శర్మ.. ఇటు యాక్టింగ్ లోనూ.. అటు గ్లామర్ లోనూ.. ఒక ఊపు ఊపేశేలా ఉంది. అలాగే 'ముసలితనం అంటే చేతకాని తనం కాదురా.. నిలువెత్తు అనుభవం' అంటూ రాసిన ఎమోషనల్ డైలాగులు బాగున్నాయ్. 'నేల టిక్కెట్టుగాళ్ళతో పెట్టుకుంటే నేల నాకిచ్చేంస్తారు అలాగే విలన్ గా జగపతి బాబు కూడా మరోసారి చాలా పవర్ఫుల్ రోల్ చేసినట్లున్నాడు.

పూర్తి స్థాయి మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో.. ముకేష్ సినిమాటోగ్రాఫీ ఒక ప్లస్ అయితే.. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ అనే చెప్పాలి. మొత్తంగా నిర్మాత రామ్ తాళ్లూరి.. ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్ గా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. చూస్తుంటే సమ్మర్ ఎండింగ్ లో మాస్ ను అలరించేసి రవితేజ మరో హిట్టు తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.

Click Here For Trailer