`సాహో` విలన్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదిరింది!

Sun May 20 2018 17:01:02 GMT+0530 (IST)

దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రాణం పోసిన ప్రభాస్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. దీంతో ప్రభాస్ తర్వాతి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రద్ధా కపూర్ లు జంటగా తెరకెక్కుతోన్న సాహోపై ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని పాన్ ఇండియా అప్పీల్ రావడం కోసం ఈ సినిమాలో బాలీవుడ్ నటులను ఎంపిక చేశారు. సాహోలో ప్రభాస్ కు విలన్ గా విలక్షణ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను సుజీత్ ఎంపిక చేశాడు. తాజాగా ఆ సినిమాలో విలన్ నీల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.ఓ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే నాయకుడి పాత్ర అంత రక్తి కడుతుంది. అందుకే ప్రభాస్ కు దీటుగా ఉండేలా విలన్ గా నీల్ ను సుజీత్ ఎంపిక చేశాడు. `కత్తి` సినిమాలో విలన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన నీల్ ...ప్రభాస్ కు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. గుబురుగడ్డంతో....పదునైన చూపులతో ఉన్న నీల్ లుక్ విడుదలైంది. ఉబెర్ స్టైలిస్ లుక్ లో ఉన్న నీల్ కళ్లల్లో...తీవ్రతను చూస్తుంటే ఆ పాత్రలో నీల్ జీవించినట్లు కనబడుతోంది. ప్రస్తుతం దుబాయ్ లో ప్రభాస్ తో పాటు నీల్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ లుక్ తో సాహోపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. మరి సాహోలో ప్రభాస్-నీల్ ల మధ్య వైరం ఎటువంటిదో.....వారిద్దరు తలపడే సన్నివేశాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.