Begin typing your search above and press return to search.

తమిళనాట ఆ షోపై తీవ్ర దుమారం

By:  Tupaki Desk   |   19 Nov 2017 6:30 AM GMT
తమిళనాట ఆ షోపై తీవ్ర దుమారం
X
ఓ ప్రముఖ తమిళ టీవీ ఛానెల్లో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం తీవ్ర దుమారం రేపుతోంది. ‘నీయా నానా’ (నువ్వా నేనా) పేరుతో ఆ షో నడుస్తోంది. ఇందులో భాగంగా కేరళ-తమిళనాడు.. ఈ రెండింట్లో ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అందంగా ఉంటారంటూ గత నెలలో ఒక చర్చ చేపట్టారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ఈ షో ఎపిసోడ్ ప్రసారం కానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి వచ్చింది. ఈ షోలో కేరళ-తమిళనాడు రెండు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలూ పాల్గొన్నారు. ఈ షో యాంకర్.. రెండు రాష్ట్రాల అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉంటారనే విషయంలో ఒక ఆన్‌లైన్‌ పోల్‌ కూడా నిర్వహించారు.

ఐతే అందం గురించి ఇలాంటి చర్చ చేపట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్యమకారులు.. మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ప్రసారం కావాల్సిన ఆ ఎపిసోడ్‌ ను పోలీసుల ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు ఛానెల్‌ ప్రకటించింది. ఐతే తమ షోలో కేవలం జనాల అభిప్రాయాలు మాత్రమే చూపిస్తున్నామని.. నిజానికి ఇందులో జరిగిన చర్చ అమ్మాయి వ్యక్తిత్వాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా సాగిందని ఈ షో డైరెక్టర్ ఆంటోనీ అంటున్నాడు. కొందరు లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్లు ఈ షోకు అడ్డం పడ్డారని.. సరిగ్గా ఎపిసోడ్ ప్రసారమయ్యే ముందు వారు దీన్ని వివాదం చేశారని అతనన్నాడు. ఐతే ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తేనే ఇది మహిళల్ని కించపరిచేలా ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని.. అందుకే తాము దీన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని మహిళా సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.