తమన్నా వలన డైరక్టర్ ఔట్??

Fri Jan 12 2018 23:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం క్వీన్. ఈ సినిమా తరవాతే ఆమెకు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ఆఫర్లు పెరిగాయి. బాలీవుడ్ లో ఈ సినిమా వచ్చి ఐదేళ్లవుతోంది. ఎప్పటి నుంచో ఈ సినిమా సౌత్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అనుకోకుండా ఒకేసారి సౌత్ లోని నాలుగు భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతోంది.క్వీన్ మళయాళం.. తెలుగు వెర్షన్లను ఒకరే డైరెక్ట్ చేస్తున్నారు. మిస్సమ్మ లాంటి సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నీలకంఠ ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వెర్షన్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మళయాళంలో సాహసం శ్వాసగా సాగిపో ఫేం మంజిమా మోహన్ నటిస్తోంది. తెలుగులో ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఇందుకోసం సినిమా యూనిట్ ఫ్రాన్స్ కు కూడా వెళ్లొచ్చింది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ డైరెక్షన్ బాధ్యతల నుంచి నీలకంఠ పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ తమన్నాతో తేడా కొట్టడంతో ఈ సినిమా డైరెక్షన్ తనవల్ల కాదంటూ నీలకంఠ చేతులెత్తేశాడనేది లేటెస్ట్ టాక్.

ఇక్కడ విశేషం ఏమిటంటే స్వతహాగా తెలుగువాడైన నీలకంఠ ఈ సినిమా మళయాళ వెర్షన్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడట. మరి తెలుగు వెర్షన్ కు కొత్త బాధ్యతలు ఎవరు తీసుకుంటారు.. లేక నిర్మాతలు అతడిని కన్విన్స్ చేస్తారా అన్నది ఎదురుచూడాల్సి ఉంది. ఎన్నో లెక్కలు వేసిన తరవాత మొదలుపెట్టిన క్వీన్ ఇలా మొదట్లోనే అడ్డం తిరిగిందేంటో?