మనోడికి అక్కడైనా సక్సెస్ దక్కేనా?

Wed Dec 19 2018 09:00:01 GMT+0530 (IST)

జాతీయ అవార్డు మూవీ ‘షో’ను తెరకెక్కించిన దర్శకుడు నీలకంఠ తెలుగులో పలు విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అయితే దక్కించుకున్నాయి కాని కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయాయి. మిస్సమ్మ - సదా మీ సేవలో - నందనవనం 120 కిమి - మిస్టర్ మేధావి చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలే. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా కమర్షియల్ గా ఆయనకు సక్సెస్ ను తేలేక పోయాయి. తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్స్ తెచ్చిన దర్శకులకే అవకాశాలు వస్తాయి. నీలకంఠకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మలయాళ సినీ ఇండస్ట్రీకి వెళ్లాడు.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ ను మలయాళంలో నీలకంఠం ‘జామ్ జామ్’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అక్కడ అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ క్వీన్ ను ఉన్నది ఉన్నట్లుగా దించేయకుండా - తనదైన శైలిలో కాస్త మార్పులు చేర్పులు చేసి రీమేక్ ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

డిసెంబర్ 21న ‘జామ్ జామ్’ టీజర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొంది కమర్షియల్ సక్సెస్ లను అందుకోలేక పోయిన నీలకంఠ మలయాళంలో అయినా కమర్షియల్ బ్రేక్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి. అదే క్వీన్ రీమేక్ తమిళం - తెలుగులో కూడా రూపొందుతున్న విషయం తెల్సిందే. తెలుగులో తమన్నా హీరోయిన్ గా రీమేక్ రూపొందుతుంది. తమిళంలో కాజల్ హీరోయిన్ గా రూపొందుతుంది. అన్ని భాషల్లో కూడా కాస్త అటు ఇటుగా ఒకే సారి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.