Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి నయనతార?

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:22 AM GMT
రాజకీయాల్లోకి నయనతార?
X
సినిమా తారలకు రాజకీయాలపై ఎందుకో మక్కువ ఎక్కువ? కారణం ఏదైనా కానీ.. సినీనటుల రాజకీయ రంగప్రవేశం సర్వసాధారణమైన విషయంగా మారిపోయి చాలా కాలమే అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లిన నటులు కొంతమంది ఎమ్మెల్యేలుగా - మరికొంతమంది మంత్రులుగా - రాజ్యసభ సభ్యులుగా రాణిస్తే.. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులే అయిపోయారు.. రాష్ట్రాలను తమదైన శైలిలో పాలించారు. సినీతారలు రాజకీయాల్లోకి రావడం అనేది ఆయా నటులకున్న ఆసక్తి కొందరికైతే.. రాజకీయ పార్టీల వ్యూహాల్లో భాగమా వచ్చేది మరికొందరు. ఈ రెండింటిలో ఏ కారణంతో వస్తుందో తెలియదు కానీ.. హీరోయిన్ నయనతార రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ను ఆదర్శంగా తీసుకుందో లేక పార్టీల స్వాగతాలు పెరిగిపోయాయో కానీ.. తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయనతార రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తిచేసిందని ఇక నేరుగా రంగంలోకి దిగడమే మిగిలుందని చెబుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నయన తారను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఏ సినిమా ప్రమోషన్ లోనూ పాల్గొననని చెప్పే నయన.. అధికార పార్టీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారట.

తాను నటించిన చిత్రాల ప్రచారం కార్యక్రమాల్లోనే ఆమె పాల్గొనదు, పైగా ఈ కండిషన్ పెట్టి మరీ సినిమాలకు అంగీకరిస్తుంటుంది.. అలాంటి నయన అధికార పార్టీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది. పైగా అవార్డు ఫంక్షన్స్ కి హీరోయిన్ వచ్చే టైపులో కాకుండా పూర్తిగా కట్టుబొట్టూ మార్చేసి సాదాగా రావడంతో "రాజకీయాల్లోకి నయన" అనే అంశంపై కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నీ అనుకూలంగా జరిగితే త్వరలోనే నయన అధికారపార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని తమిళ సినీ - రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కాగా ఈ మధ్యకాలంలోనే నటి నమిత అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.