Begin typing your search above and press return to search.

విజయ్‌ కి హ్యాండ్‌ ఇచ్చింది.. మరి సైరాకు?

By:  Tupaki Desk   |   20 Sep 2019 11:12 AM GMT
విజయ్‌ కి హ్యాండ్‌ ఇచ్చింది.. మరి సైరాకు?
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకుని ఎన్నో బ్లాక్‌ బస్టర్స్‌ ను తన ఖాతాలో వేసుకుంది. కాని ఆమెపై ఒక విమర్శ మాత్రం అలాగే ఉంటోంది. సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు ఆమె హాజరు అవ్వదు. పారితోషికం తీసుకుని నటించిన సినిమాకు పబ్లిసిటీ చేసేందుకు ఎందుకు రాకూడదు అంటూ చాలా మంది ప్రశ్నించినా కూడా ఆమె మాత్రం మొదటి నుండి ప్రమోషన్స్‌ కు దూరంగా ఉంటూనే ఉంది. అయితే ఇటీవల ఆమె నటించిన బిజిల్‌ మరియు సైరా చిత్రాల ప్రమోషనల్‌ కార్యక్రమాలకు హాజరు అవ్వనుందని ప్రచారం జరిగింది. కాని ఆ ప్రచారం పుకార్లే అని సగం వరకు తేలిపోయింది.

ఇటీవలే విజయ్‌ హీరోగా అట్లీ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'బిగిల్‌' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు.. హీరోతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌.. ఇంకా ప్రముఖ నటీనటులు హాజరు అయ్యారు. చెన్నైలోని ఒక కాలేజ్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో నయన్‌ మాత్రం కనిపించలేదు. మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా బిగిల్‌ ఆడియో వేడుకలో నయన్‌ పాల్గొనలేదు. ఇక రెండు రోజుల్లో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరుగబోతున్న సైరా చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో అయినా ఈమె పాల్గొంటుందా అనే చర్చ జరుగుతోంది.

తమిళంలో సూపర్‌ స్టార్‌ అయిన విజయ్‌ మూవీ బిగిల్‌ ఆడియోలోనే పాల్గొనని నయనతార మెగాస్టార్‌ చిరంజీవి సైరా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో మాత్రం పాల్గొంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ఎంజాయ్‌ చేస్తూనే సినిమాలతో చాలా బిజీగా ఉన్న నయనతార సైరా కోసం హైదరాబాద్‌ వచ్చేది లేనిది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమితాబచ్చన్‌ - చిరంజీవి ఇంకా పలువురు స్టార్స్‌ హాజరు కానున్నారు కనుక నయన్‌ ను హాజరు అయ్యేలా చేయాలని చరణ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి నయన్‌ మనసు మార్చుకుని తన పాలసీ పక్కన పెట్టి ప్రీ రిలీజ్‌ వేడుకకు వస్తుందా చూడాలి. ఈనెల 22న మెగా ఫ్యాన్స్‌ సమక్షంలో భారీ ఎత్తున ఈ వేడుక ఎల్బీ స్టేడియంలో జరుగబోతుంది. పవన్‌ కళ్యాణ్‌.. రాజమౌళి హాజరు అవ్వబోతున్న విషయం తెల్సిందే.