Begin typing your search above and press return to search.

నయనతారకు మూడు రోజుల్లో 10 కోట్లా.?

By:  Tupaki Desk   |   21 Aug 2018 6:03 AM GMT
నయనతారకు మూడు రోజుల్లో 10 కోట్లా.?
X

తెలుగునాట అప్పట్లో లేడి సూపర్ స్టార్ గా విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె ఎన్నో లేడి ఓరియెంటెడ్ మూవీలు తీసి స్టార్ హీరోలతో సమానంగా కలెక్షన్లు కొల్లగొట్టేది. ఆ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ రాలేదు. ఇప్పట్లో తెలుగులో అనుష్క అలాంటి పాత్రను పోషిస్తుండగా.. తమిళనాట ఇప్పుడు నయనతార అంతకు మించిన క్రేజ్ ను సొంతం చేసుకుంది. లేడి సూపర్ స్టార్ గా నయనతార అవతరించింది.

నయనతార ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఆమె నటించిన డోరా - మాయా - ఆరంభ్ చిత్రాలు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూళ్లు సాధించాయి. దీంతో లేడి సూపర్ స్టార్ అంటూ నయనతార పేరు మారుమోగిపోతోంది. తాజాగా నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ మూవీ గత శుక్రవారం తమిళంలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. స్టార్ హీరో లేకుండానే కేవలం నయనతార ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. తెలుగులోనూ విడుదల చే్ద్దామని చూసినా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన ‘కోలమావు కోకిల’ మూవీకి తమిళనాట విశేషమైన ఆదరణ దక్కుతోంది. ఈ మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. పాజిటివ్ రివ్యూలు - ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీ లతో ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభిస్తోంది.

కథ విషయానికి వస్తే.. నయనతార ఈ సినిమాలో స్మగ్లింగ్ చేసే మహిళ పాత్రలో నటించింది. కథలో భాగంగా 25 కోట్ల విలువైన ఒక మత్తు పదార్థాన్ని నయన్ ఒక చోటు నుంచి మరో చోటికి చేర్చాలి. ఇందుకోసం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తుంటుంది. భయం - భయంగా.. ఏమీ తెలియని అమాయకురాలిగా ఇందులో కనిపించింది. ఆమెది పేద కుటుంబం. తల్లిదండ్రులు - ఒక చెల్లెలు ఉంటారు. వాళ్లతో పాటు నయన్ ను ప్రేమించే ఒక కమెడియన్ కూడా వీళ్లతోనే ఉంటాడు. వీళ్లంతా కలిసి ఒక వ్యాన్ లో బయలు దేరుతారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలోనే సినిమా సాగుతుంది.

నయనతారను అంతమొందించాలని విలన్లు ప్రయత్నిస్తుండడంతో.. నయన్ ఎదురు తిరిగి తనలోని అసలు యాంగిల్ ను చూపిస్తుంది. విలన్లకు షాకిస్తుంది. హర్రర్ నేపథ్యంలో సినిమా సాగింది. ఈ సినిమాలో ఎప్పుడూ చేయనటువంటి క్యారెక్టర్ లో నయన తార నటించింది. ఆమె లుక్ - స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయాయనే చెప్పాలి.

సీనియర్ హీరోయిన్ అయిన నయనతార కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ విజయాలను అందుకుంటోంది. అందుకే కొత్త దర్శకులకే ఎక్కువగా అవకాశం ఇస్తోంది. వారి భిన్నమైన కథలను ఎంచుకుంటూ అందులో ఒదిగిపోతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వరుసగా నాలుగు లేడి ఓరియెంటెడ్ చిత్రాల హిట్ తో తమిళనాట ఇప్పుడు లేడి సూపర్ స్టార్ గా నయనతార అవతరించింది.