నయన్ కండిషన్స్ నిజమే అన్నమాట

Sat Jan 13 2018 23:00:01 GMT+0530 (IST)

దక్షిణాది సోయగం నయనతార బాగా ప్రొఫెషనల్ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏది పడితే అది ఒప్పేసుకునే పరిస్థితే కాదు.. నచ్చిన వాటిలోంచి మెచ్చిన వాటిని ఏరుకుని ఎన్నుకుంటే గానీ.. కమిట్మెంట్స్ ను కంప్లీట్ చేయలేనంత బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.తమిళంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న నయన్.. తెలుగులో సీనియర్ హీరోల సరసన అడపాదడపా మెరుస్తోంది. అది కూడా భారీ మొత్తం పారితోషికం ముట్టచెబితేనే సుమా అని గుర్తుంచుకోవాలి. మరి అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటోంది కదా అని.. అన్ని రకాల సినిమాలు.. సీన్స్ చేస్తుందని అనుకోకండి. రీసెంట్ గా రిలీజ్ అయిన జైసింహా మూవీ చూస్తే.. నయనతార ఎంతటి స్ట్రిక్ట్ అనే సంగతి అర్ధమవుతుంది. తన పాత్రతో ఎంతగా మెప్పించినా.. ఈ సినిమా మొత్తంలో హీరో ఎక్కడా కనీసం హీరోయిన్ చిటికెన వేలిని కూడా ముట్టుకోడు.

అలాంటి సీన్స్ ఉండకూడదని.. కనీసం ముట్టుకునే సన్నివేశాల్లో కూడా నటించనని.. అడ్డమైన డ్యాన్సులు చేయనని నయన్ ముందే కండిషన్స్ పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు జైసింహా మూవీ చూస్తే.. నయనతార కండిషన్స్ మాటలు నిజమే అని అర్ధమవుతాయి. ముఖ్యంగా విఘ్నేష్ శివన్ తో పెళ్లి అనుకున్నప్పటి నుంచి.. నయన్ లో గ్లామర్ యాంగిల్ బొత్తిగా కరువైపోయింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేది లేదంటూ నయన్ కండిషన్ పెడుతుందనే సంగతి తెలుసుకదా!